కన్నడ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్లకే గుండెపోటుతో మృతిచెందాడు. శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ గుండెపోటుతో కుప్పకూలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అయితే పునీత్ రాజ్ కుమార్ తన మరణం తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని చూడనున్నాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కళ్లను దానం చేయనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.
Read Also: పునీత్ రాజ్ కుమార్ నట ప్రస్థానం
గతంలో పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు కూడా ఆయన నేత్రాలను మరొకరి కోసం కుటుంబీకులు దానం చేసి కొత్త వెలుగు ప్రసాదించారు. దీంతో పునీత్ కుటుంబీకులపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హీరోగా 29 సినిమాల్లో నటించిన పునీత్‌ను అభిమానులు ముద్దుగా ‘అప్పు’ అని పిలుస్తుంటారు. కాగా పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్ సైతం కన్నడలో ప్రముఖ హీరో. ఆయన హీరోగా నటించిన ‘జై భజరంగీ’ (కన్నడలో భజరంగీ 2) శుక్రవారమే విడుదలైంది. ఇటీవల జరిగిన ఆ సినిమా వేడుకలో ‘కేజీఎఫ్’ ఫేమ్ హీరో యష్, అన్నయ్య శివరాజ్ తో కలిసి పునీత్ డాన్స్ చేశాడు.
