Site icon NTV Telugu

జగన్ సొంత ఇలాఖాలో జనసేన పోటీకి సై..?

pawan kalyan

pawan kalyan

కడప జిల్లాలోని బద్వేల్ లో త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. వైసీపీ ఎమ్మెల్యే మ‌ృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకే అన్న ప్రచారం జరుగుతోంది. సీఎం సొంత జిల్లా కావడం, సానుభూతి పవనాలు కలిసి రానుండటం, పార్టీ ఇక్కడ క్షేత్ర స్థాయిలో బలంగా ఉండటం ఇవన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా మారనున్నాయి. గత ఎన్నికల్లోనూ వైసీపీ కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. దీంతో వైసీపీ గెలుపు ఇక్కడ ఏకపక్షమేనని అర్థమవుతోంది.

ప్రతిపక్ష టీడీపీ సైతం బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు జంకుతోంది. కేవలం పరువు కోసమే ఆపార్టీ ఇక్కడ బరిలో నిలుస్తోంది. ఇలాంటి సమయంలో జనసేన పార్టీ ఇక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతుండటం ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం తామేనని నిరూపించేందుకు జనసేన ఉవ్విళ్లురుతోంది. దీనిలో భాగంగానే ఇక్కడ ఓడిపోతామని తెలిసినా జనసేన పోటీకి సై అంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

గత అసెంబ్లీ ఎన్నికల కంటే జనసేన పార్టీ ప్రస్తుతం పుంజుకున్నట్లే కన్పిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఫర్వాలేదనిపించింది. ఇక ఇటీవల వెల్లడైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ జనసేన చెప్పుకోదగిన పర్ఫామెన్స్ చేసింది. కొన్నిచోట్ల జనసేన అభ్యర్థులు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపించారు. ఈ ఫలితాలు జనసేనానిలో జోష్ నింపాయి. ఈమేరకు ఆయన అన్ని జిల్లాల్లోని నియోజకవర్గాల్లోని సమస్యలపై పోరాటం చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు ఫలితాల అనంతరం వెల్లడించారు.

త్వరలోనే బద్వేల్ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో జనసేన ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సై అంటుంది. సీఎం జగన్ ఇలాఖాలో ఆయన్ను ఎదుర్కోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అందరి దృష్టిని ఆకర్షించాలని యత్నిస్తుంది. అలాగే ఈ ఉప ఎన్నికలో పోటీ చేయడం ద్వారా రాయలసీమలో జనసేన ప్రభావం చూపాలని భావిస్తోంది. ఇది అసెంబ్లీ సీటు కావడంతో బీజేపీ సైతం జనసేనకు పెద్దగా అభ్యంతరం చెప్పకుండా మద్దతు ఇచ్చే అవకాశం కన్పిస్తోంది.

గత తిరుపతి  పార్లమెంట్ స్థానంలో బీజేపీ పోటీచేసి ఓడిపోయింది. జనసేన ఇక్కడి నుంచి పోటీ చేస్తుందని భావించినా చివరికీ ఆ టిక్కెట్ పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఆ ఎన్నికలో జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి ఓటమిపాలయ్యారు. నాటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య విబేధాలు నెలకొన్నాయనే ప్రచారం జరుగుతోంది. బద్వేల్ ఉపఎన్నిక నేపథ్యంలో జనసేన, బీజేపీ పోత్తు ఉంటుందా? లేదా అనేది ఓ క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తోంది.

బీజేపీ మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా జనసేన పోటీ చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఏదిఏమైనా సీఎం జగన్ సొంత ఇలాఖాలో జనసేనాని తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. జన సైనికుల్లో జోష్ నింపేందుకు జనసేన పార్టీ తమ అభ్యర్థిని బరిలో నింపుతున్నట్లు తెలుస్తోంది.  జనసేనాని చేస్తున్న ఈ ప్రయత్నం ఆపార్టీకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే..!

Exit mobile version