Site icon NTV Telugu

ఇవాళ విశాఖకు జనసేన అధినేత పవన్ కల్యాణ్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటానికి నేరుగా మద్దతు ప్రకటించనున్నారు పవన్. ఇవాళ మధ్యాహ్నం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గేట్‌ వద్ద దీక్ష చేస్తున్న కార్మికులు, నిర్వాసితుల శిబిరాలను జనసేనాని సందర్శిస్తారు. అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రధాన రహదారిపై ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పవన్ పాల్గొని పార్టీ విధానం వెల్లడిస్తారు. ఇక…ఇప్పటికే జనసేన తన సంపూర్ణ మద్దతును ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటానికి ప్రకటించింది. ఐతే…నేరుగా పవన్ కళ్యాణ్ రావడం ఉద్యమ వేడిని మరింత పెంచుతుందనే అభిప్రాయం ఉంది.

బహిరంగ సభ కంటే ఆ వేదికపై జనసేన అధ్యక్షుడు ఎలా రియాక్ట్ అవుతారా?అనే ఉత్కంఠ కార్మికులు, రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. మొదటి నుంచి జనసేన విధానం ప్రయివేటీకరణకు వ్యతిరేకమే. కొత్తగా పవన్‌ ఏవైనా డిమాండ్లను కేంద్రం ముందు పెడతారా?అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ పేరుతో ఉక్కు ఫ్యాక్టరీని తెగనమ్మేందుకు కంకణం కట్టుకుంది. ప్రయివేటీకరణ విధానపరమైన నిర్ణయం కనుక ఎటువంటి మార్పు లేదని తెగేసి చెబుతోంది.

అదే సమయంలో బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేన పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. సోమ, మంగళవారాలు పవన్‌ విశాఖలోనే ఉంటారు. ప్రతీ జిల్లా నుంచి 500 మందికి తగ్గకుండా ఈ సమీక్షలకు హాజరుకానున్నట్టు సమాచారం. మరోవైపు పోలీసులు సూచించిన ప్రాంతాల్లో సభ నిర్వహణకు జనసేన అంగీకరించలేదు. మొత్తానికి..జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంట్రీ తర్వాత విశాఖ ఉక్కు ఉద్యమం ఎలాంటి మలుపు తీసుకుంటుందనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Exit mobile version