కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన “జై భీమ్” సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. కులం లాంటి సీరియస్ సబ్జెక్ట్ తో, అణగారిన వర్గాలపై పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలపై తెరకెక్కిన ఈ సినిమాపై కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందులో ఒకరు మాజీ మంత్రి అన్బుమణి రాందాస్. “జై భీమ్” సినిమాపై రాందాస్ చేసిన ఆరోపణలన్నింటికీ సూర్య తాజాగా సమాధానమిచ్చారు. నవంబర్ 11న సూర్య తన ట్విట్టర్ ఖాతా నుంచి రాందాస్ ఆరోపణలకు సంబంధించి రిప్లై ఇస్తూ సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో రాందాస్ చేసిన ఆరోపణలన్నింటికీ వరుస క్రమంలో సమాధానమిచ్చారు. ఏ వ్యక్తి లేదా సమాజం మనోభావాలను దెబ్బతీసే, బాధ పెట్టే ఉద్దేశం తమ చిత్ర బృందానికి లేదని సూర్య లేఖలో రాశారు.
Read Also : సోషల్ మీడియాకు అల్లు హీరో గుడ్ బై… స్పెషల్ డే అంటూ లాస్ట్ ట్వీట్
నవంబర్ 10న రాజ్యసభ ఎంపీ, కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి రాందాస్ సినిమాపై పలు ప్రశ్నలు వేస్తూ లేఖ విడుదల చేశారు. ఒక పోలీసును క్రూరంగా చిత్రీకరించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అలా చేయడం ద్వారా వన్నియార్ సమాజాన్ని అవమానించారని ఆరోపించారు. ఈ లేఖలో మరెన్నో విషయాలను ప్రస్తావించారు. చాలా మంది పాత్రల పేర్లు నిజజీవితంలో ఉన్నట్లుగా ఉంచారని, అయితే పోలీసు అధికారి పేరును మార్చారని, ఈ సినిమాలో చాలా సన్నివేశాలను చొప్పించారని, ఇది ఉద్దేశపూర్వకంగా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన “జై భీమ్” గిరిజన వర్గాల ప్రజలను పోలీసులు అన్యాయంగా కేసుల్లో ఇరికించి చిత్రహింసలకు గురి చేసిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. రిటైర్డ్ జడ్జి కె చంద్రు న్యాయ పోరాటం చేసిన కథ ఇది. 90ల నాటి ఈ కథపై కొంతమంది విమర్శలు కురిపిస్తున్నప్పటికీ, ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పట్టారు.
