ఇండియన్ ఐడల్… ఈ పేరు సంగీత ప్రియులకు బాగా పరిచయమే. ప్రస్తుతం ఈ సక్సెస్ ఫుల్ సింగింగ్ రియాల్టీ షో 12వ సీజన్ కొనసాగుతోంది. అయితే, ఓ సీనియర్ సింగర్ ఇండియన్ ఐడల్ తాజా సీజన్ నడుస్తోన్న తీరును తప్పుబట్టాడు. పోటీలో పాల్గొంటోన్న గాయనీగాయకుల మధ్య ఫేక్ లవ్ స్టోరీస్, వారి వ్యక్తిగత జీవితంలోని పేదరికం వంటి వాటికి మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అన్నాడు. గాత్రంతో పోటీ పడాల్సిన చోట ఇతర ఎమోషనల్ విషయాలు, కామెడీ సంగతులు పెద్ద పీట వేసుకుని కూర్చుంటున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇండియన్ ఐడల్ లో గాయకుల ప్రతిభకి విలువ తగ్గిపోతోందని వాపోయాడు.
ఇండియన్ ఐడల్ లాంటి దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న షోపైన కామెంట్స్ చేసింది మరెవరో కాదు… ఇండియన్ ఐడల్ మొట్ట మొదటి సీజన్ టైటిల్ విన్నర్ అభిజీత్ సావంత్! అవును, ఫస్ట్ సీజన్ లో గెలిచినాయనే ఇప్పుడు 12వ సీజన్లో డ్రామా ఎక్కువై, టాలెంట్ తక్కువైపోతోందని విమర్శిస్తున్నాడు. అందులో నిజం కూడా లేకపోలేదు. ఈసారి ఇండియన్ ఐడల్ టైటిల్ కోసం పోటీ పడుతోన్న వారిలో పవన్ దీప్ రాజన్, అరుణితా కంజిలాల్ అంటూ ఇద్దరు యంగ్ సింగర్స్ ఉన్నారు. వారి మధ్య ప్రేమ చిగురించింది అంటూ షో నిర్వాహకులు రకరకాల ఫేక్ సీన్స్, సిట్యుయేషన్స్ సృష్టించారు. కానీ, తాజాగా ఇండియన్ ఐడల్ హోస్ట్ ఆదిత్య నారాయణ్ అదంతా ఒట్టిదేనని తేల్చేశాడు. ఇంతకు ముందు సీజన్ లో కూడా యాంకర్ ఆదిత్య నారాయణ్, జడ్జ్ నేహ కక్కర్ మధ్య ప్రతీ ఎపిసోడ్ లోనూ పబ్లిక్ రొమాన్స్ నడిచేది. తీరా షో పూర్తయ్యాక ఇటు ఆదిత్య నారాయణ్, అటు నేహ కక్కర్ తమ తమ రియల్ లైఫ్ లవ్వర్స్ ని పెళ్లి చేసుకున్నారు!
ఫేక్ లవ్ స్టోరీలు చూపిస్తూ టీఆర్పీలు సంపాదించటమే కాకుండా… ఇండియన్ ఐడల్ నిర్వాహకులు కొందరు కంటెస్టెంట్స్ పేద వారంటూ, వాళ్లకి ఉన్న వ్యక్తిగత సమస్యల్ని తెర మీద చూపించేస్తున్నారు. ఆ ఎమోషనల్ విజువల్స్ ని ప్రోమోల్లో, కమింగ్ అప్స్ లో వాడుకుంటూ జనాల్ని టీవీల ముందు కూర్చోబెడుతున్నారు. ఇదంతా చేయటం వల్ల సింగర్స్ ఎలా పాడుతున్నారు అనేది పెద్దగా ఇంపార్టెంట్ కాదన్నట్టుగా మారిపోతోంది. ఫస్ట్ ఇండియన్ ఐడల్ అయిన అభిజీత్ సావంత్ తెలుగు, తమిళ, కన్నడ లాంటి భాషల్లో మ్యూజిక్ రియాల్టీ షోస్ గురించి ప్రస్తావించాడు. ప్రాంతీయ సంగీత కార్యక్రమాల్లో కంటెస్టెంట్స్ బ్యాక్ గ్రౌండ్ ఎవ్వరికీ తెలియదని, హిందీలో మాత్రం అనవసర విషయాలకి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నాడు!
అనేక రకాల విమర్శల్ని ఎదుర్కొంటోన్న తాజా ఇండియన్ ఐడల్ సీజన్లో… తెలుగు సింగర్ షణ్ముఖప్రియ మాత్రం మంచి గుర్తింపు సంపాదిస్తోంది. లెటెస్ట్ ప్రొమోలో ఆమెను సీనియర్ జడ్జ్ అనూ మాలిక్ తెగ పొగిడేశాడు. ‘’నాకైతే నెక్ట్స్ ఇండియన్ ఐడల్ నీలో కనిపిస్తోంది!’’ అంటూ కామెంట్ చేశాడు. చూడాలి మరి, షణ్ముఖప్రియ జాతీయ స్థాయి విజేతగా నిలుస్తుందో లేదో…
A post shared by Sony Entertainment Television (@sonytvofficial)