NTV Telugu Site icon

భార‌త్‌లో త‌గ్గిన క‌రోనా కేసులు.. 46 రోజుల్లో అతి త‌క్కువ‌..!

Covid 19

భార‌త్‌లో క్ర‌మంగా క‌రోనా పాజిటివ్ కేసులు దిగివ‌స్తున్నాయి… కేంద్ర ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. గత 24 గంటల్లో దేశ‌వ్యాప్తంగా 173,921 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. ఇది 46 రోజుల్లో అతి తక్కువ రోజువారీ కేసుల సంఖ్య, అయితే, రోజువారీ మరణాల సంఖ్య మూడువేల‌కు పైగానే న‌మోదు అవుతోంది.. తాజాగా మ‌రో 3,563 మంది క‌రోనాతో మృతిచెందారు.. ఇదే స‌మ‌యంలో 2,84,601 మంది క‌రోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,19,431కు చేరుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 3,18,821 మంది మ‌ర‌ణించారు.. ఇక‌, రిక‌వ‌రీ కేసులు 2,51,78,011కు పెరిగాయి..

గత 24 గంటల్లో న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 31,079 కొత్త‌కేసుల‌తో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది.. ఆ త‌ర్వాత కర్ణాటకలో 22,823 కొత్త కేసులు, కేరళలో 22,318 కేసులు, మహారాష్ట్రలో 20,740, ఆంధ్రప్రదేశ్‌లో 14,429 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 12,193 కేసులు వెలుగు చూశాయి.. ఇక‌, అత్య‌ధిక కేసులు న‌మోదైన రాష్ట్రాల‌ను ప‌రిశీలిస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు మహారాష్ట్రలో 5,692,920, కర్ణాటకలో 2,546,821, కేరళలో 2,470,872, తమిళనాడులో 2,009,700, ఉత్తర ప్రదేశ్ లో 1,686,267, ఆంధ్రప్రదేశ్ లో 1,657,96 కేసులు న‌మోదు అయ్యాయి.. మ‌రోవైపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌మోదైన కేసుల సంఖ్య 17,01,13,245కు చేరింది.. ఇప్ప‌టి వ‌ర‌కు 15,20,94,863 మంది కోలుకోగా, 35,36,896 మంది మరణించారు.