హుజురాబాద్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. మాజీ మంత్రి ఈటల రాజీనామాతో హుజురాబాద్ లో ఉప ఎన్నికల అనివార్యం అయింది. ఉప ఎన్నిక తేదీ ఖరారు కాకముందే… అన్ని పార్టీలు హుజురాబాద్‌లో పాగ వేశాయి. విస్ర్తుత స్థాయిలో ప్రచారం కూడా చేస్తున్నాయి. ఉద్యమంలో ఉన్న నాయకులకు అన్యాయం జరిగిందనే… సెంటిమెంట్ ను ఈటల రాజేందర్ ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారు. అటు టీఆర్‌ఎస్… సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న బీజేపీలోకి ఈటల ఎందుకు వెళ్లారంటూ? ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. ఈటలకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అనుసరించిన ఫార్ములాను హుజురాబాద్‌లో అమలు చేస్తారట. ఈ రెండు పార్టీలు ఇలా ఉండగా… కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి అన్నీ తానై హుజురాబాద్‌లో దూసుకువెళుతున్నాడు.
read also :‘దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్’పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. రేపు అఖిలపక్ష భేటీ
2018 ముందస్తు ఎన్నికల్లో 30వేల పై చిలుకు ఓట్లతో ఓటమి పాలైన కౌశిక్.. ఈ సారి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తానని సవాల్ విసురుతున్నాడు. ప్రచారం బాగానే ఉంది.. కానీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా ? అని ఎదురు చూస్తున్నారు అన్ని పార్టీల లీడర్లు. అయితే.. కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ నెలలో హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వస్తుందని తెలుస్తోంది. సెప్టెంబర్ వరకు కరోనా పరిస్థితులు మెరుగు పడతాయనే భావనలో ఉన్న ఎన్నికల సంఘం… ఆ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోందట. ఉప ఎన్నిక వచ్చే లోపు 80 శాతం వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేయాలని కేసీఆర్ సర్కార్ కూడా భావిస్తోందట. కాగా… హుజురాబాద్ ఉపఎన్నికకు టీఆర్‌ఎస్ అభ్యర్థి ఖరారు కాలేదన్న విషయం తెలిసిందే.
