Site icon NTV Telugu

హైవే 163 విస్తరణ.. 900 మర్రి చెట్లకు కష్టకాలం

రంగారెడ్డి జిల్లాలో హైవే నెంబర్ 163 విస్తరణకు రంగం సిద్ధమయింది. అయితే ఈ రహదారిలో ఎక్కువగా మర్రి చెట్లు వున్నాయి. వీటికి వందల ఏళ్ళ చరిత్ర వుందని పరిశోధకులు, పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. హైవే విస్తరణ కారణంగా వాటిని తిరిగి వేరేచోట పాతాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి ఈ మర్రి చెట్లు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. ఈ రహదారిపై ఇరువైపులా 900 మర్రిచెట్లు వున్నాయి. వాటిని భద్రంగా తీసి వేరేచోట భద్రపరచాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు. వీటికి వందేళ్ళ చరిత్ర వుంది. రహదారికి ఇవి ఎంతో అందం తెచ్చిపెడుతున్నాయి. హైవేని విస్తరిస్తే ఇలాంటి అరుదైన చెట్లు కనుమరుగు అవుతాయంటున్నారు. చెట్లను నరకకుండా రహదారి నిర్మాణంలో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు.

రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం వున్న రహదారులు ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. బీజాపూర్‌ జాతీయ రహదారిపై అప్పా జంక్షన్‌ నుంచి చేవెళ్ల, మన్నెగూడ, పరిగి, కర్నాటకలోని బీజాపూర్‌ వరకు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. మన్నెగూడ వరకు అధిక ట్రాఫిక్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి కేంద్రానికి తెలియచేశారు ప్రజాప్రతినిధులు.

ఈ రహదారి చిన్నగా ఉండడం, వాహనాలు పెరుగడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌ లు ఆస్పత్రులకు చేరేందుకు కూడా బాగా సమయం పడుతోంది. ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని నాలుగు లేన్ల రహదారిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకుగాను ఆమోదం లభించింది. అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు రూ.928.41 కోట్లతో నాలుగు లేన్ల రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. తొలుత రూ.800 కోట్లతో రహదారి విస్తరణ పనులకు సంబంధించి అంచనాలను రూపొందించినప్పటికీ, తాజా అంచనాల ప్రకారం మరో రూ.128 కోట్లకు పెంచారు. అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర బీజాపూర్‌ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. రోడ్డు విస్తరణ పనులకుగాను 350 ఎకరాల మేర భూములను సేకరిస్తారు.

ఈ రహదారి ఎక్స్‌ప్రెస్‌ వే తరహాలో అందుబాటులోకి రానుంది. మన్నెగూడ నుంచి పరిగి, కొడంగల్‌, బీజాపూర్‌ వరకు 45 మీటర్ల మేర మూడు లేన్ల రహదారి అందుబాటులోకి వచ్చింది. అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు వెళ్లే జాతీయ రహదారి మధ్య ఉన్న గ్రామాల నుంచి వచ్చే వాహనాలు నేరుగా జాతీయ రహదారిపైకి రాకుండా అండర్‌పాస్‌ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. 46 కి.మీ పరిధిలో 6 భారీ అండర్‌పాస్‌ బ్రిడ్జిలను, ఎనిమిది ప్రాంతాల్లో చిన్న అండర్‌పాస్‌ బ్రిడ్జిలను నిర్మించి అందుబాటులోకి తీసుకువస్తారు. నాలుగు లేన్ల రహదారి కానుండడంతో అంగడిచిట్టంపల్లి వద్ద 12 లేన్ల టోల్‌ప్లాజా ఏర్పాటు చేస్తారు.

Exit mobile version