NTV Telugu Site icon

రివ్యూ : గల్లీ రౌడీ సినిమా

Gully Rowdy Movie Review

ఈ యేడాది ఇప్పటికే సందీప్ కిషన్ నటించిన ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’, ‘వివాహ భోజనంబు’ చిత్రాలు విడుదలయ్యాయి. విశేషం ఏమంటే… ఆ రెండు సినిమాలకూ సందీప్ కిషన్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. అందులో మొదటిది మార్చిలో థియేటర్లలో రిలీజ్ కాగా, రెండోది సోనీ లివ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యింది. తాజాగా సందీప్ కిషన్ హీరోగా కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘గల్లీ రౌడీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండేళ్ళ క్రితం సందీప్ కిషన్ తో ‘తెనాలి రామకృష్ణ బి.ఎ., బి.ఎల్.’ చిత్రం రూపొందించిన జి. నాగేశ్వరరెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

వైజాగ్ లో బీదలకు న్యాయం చేయడం కోసం రౌడీగా మారతాడు సింహాచలం (నాగినీడు). అయితే తన వెనకే ఉండి, గోతులు తీస్తూ, బీదవారికి అన్యాయం చేస్తున్నాడని తెలిసి తన అనుచరుడు బైరాగి నాయుడు (మైమ్ గోపీ) ని పక్కన పెడతాడు. దాంతో కక్షకట్టిన బైరాగి… సింహాచలంను ఘోరంగా అవమానిస్తాడు. ఆ అవమానభారంతో రౌడీయిజం నుండి తప్పుకుంటాడు సింహాచలం. అయితే అతని అనుచరులు మాత్రం సింహాచలం మనవడు వాసు (సందీప్ కిషన్)ను అయినా రౌడీగా చూడాలని కలలుకంటూ ఉంటారు. తనను ఏడిపిస్తున్న ఓ రౌడీ ఆటకట్టించమంటూ సాహితి (నేహా శెట్టి) స్నేహితుడి సాయంతో వాసు దగ్గరకు వస్తుంది. ఆమెతో తొలిచూపు ప్రేమలో పడిన వాసు… వారసత్వంగా అబ్బిన రౌడీయిజాన్ని స్వీకరించాడా? లేక మామూలు మనిషిగా జీవితాన్ని సాగించాడా? వాసు తాత సింహాచలం పగ ఎలా చల్లారింది? అనేది మిగతా కథ.

వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు మొదట ‘రౌడీ బేబీ’ అనే పేరు పెట్టారు. అయితే కథకు ఆ టైటిల్ సూట్ కాదని గ్రహించి ‘గల్లీ రౌడీ’గా మార్చారు. తమ కుటుంబ పెద్దలను అవమానించిన వారిపై పగ తీర్చుకునే హీరోల కథలతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో మాత్రం హీరో కక్షలు, కార్పణ్యాలకు దూరంగా తన బతుకేదో తాను బతకాలని చూస్తుంటాడు. కానీ అలా జరగదు, తనకు సంబంధం లేకుండానే కత్తి పట్టాల్సి వస్తుంది. ఇదంతా మనకు బోలెడంత వినోదాన్ని పంచే అంశమే. అలానే విలన్ బైరాగిని కిడ్నాప్ చేయడానికి హీరో బృందం చేసే ప్రయత్నం, ఆ తర్వాత పోలీస్ అధికారి రవి నాయక్ (బాబీ సింహా) కు వీళ్ళు టార్గెట్ కావడం అలరించాయి. సందీప్ కిషన్ మీద అభిమానంతో కావచ్చు… క్లయిమాక్స్ లో అవసరానికి మించి యాక్షన్ ఎపిసోడ్ ను లావిష్ గా తీశారు. ఇలాంటి వినోద ప్రధాన చిత్రాలకు నిజానికి అంత భారీతనం అవసరం లేదు. కానీ నిర్మాతలు కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఆ విషయంలో రాజీ పడలేదు. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డికి ఇలాంటి కథలను హ్యాండిల్ చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఇక రామ్ మిర్యాల రాసి, స్వర పరిచి పాడిన ‘పుట్టెనే ప్రేమ’ పాట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మిగిలిన మూడు పాటలకు సాయి కార్తీక్ స్వరాలు అందించాడు. అందులో ఐటమ్ సాంగ్ మాస్ ను ఆకట్టుకునేలా ఉంది. ఆ పాటలో నర్తించిన స్నేహ గుప్తా మూమెంట్స్ కుర్రకారును కిర్రెక్కించడం ఖాయం. హీరో సందీప్ కిషన్ కు ఈ తరహా పాత్రలు కొట్టిన పిండే. హీరోయిన్ నేహా శెట్టి ఒక్కో చోట ఒకోలా ఉంది. మరో రెండు మూడు సినిమాలు చేస్తే కానీ ఆమె సెట్ కాకపోవచ్చు. ఈ మూవీకి మెయిన్ హైలైట్ రాజేంద్ర ప్రసాద్ నటన. పట్టపగలు వెంకట్రావ్ అనే హెడ్ కానిస్టేబుల్ పాత్రకు ఆయన సంపూర్ణ న్యాయం చేకూర్చాడు. ఇంట్లోని తల్లి, భార్య, కూతురును అదుపుచేయలేని నిస్సహాయ భర్తగా చక్కగా నటించారు. ఆయన భార్యగా కల్పలత, ఫోరెన్సిక్ నిపుణురాలిగా విద్యారామన్, హీరో ఫ్రెండ్ గా వైవా హర్ష, తాతగా నాగినీడు, ఆయన అనుచరుడిగా పోసాని, ఉల్లిపాయల వ్యాపారిగా షకలక శంకర్… మరీ ముఖ్యంగా హీరోయిన్ బావగా ‘వెన్నెల’ కిషోర్ నవ్వుల పువ్వులు పూయించారు. మూవీలో బాబీ సింహా ఎంట్రీ ఇచ్చేది ద్వితీయార్థంలోనే అయినా అక్కడ నుండి అతనే కథను ముందుకు నడిస్తాడు. సరైన ఆర్టిస్టుల ఎంపికతో పాటు వారి నుండి చక్కని నటనను నాగేశ్వరరెడ్డి రాబట్టుకున్నాడు. అయితే… కథలోనూ, కథనంలోనూ ఇంకాస్తంత కొత్తదనం ఉండే మరింగ బాగుండేది. అయితే కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ తరహా వినోద ప్రధాన చిత్రమేదీ థియేటర్లలో విడుదల కాలేదు. సరదాగా సినిమాను చూసి, కాసేపు నవ్వుకునేలా ‘గల్లీ రౌడీ’ ఉంది. ఏ పర్పస్ కోసమైతే కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాను తీశారో… అది నెరవేరే ఆస్కారం ఉంది. అసభ్యతకు, అశ్లీలతకు తావు లేకుండా సరదాగా సాగిపోయే ‘గల్లీ రౌడీ’ని ఓసారి చూసేయొచ్చు.

ప్లస్ పాయింట్స్
వినోద ప్రధాన కథ కావడం
ఆకట్టుకునే సంభాషణలు
నేపథ్య సంగీతం
నిర్మాణ విలువలు

మైనెస్ పాయింట్
కథలో కొత్తదనం లేకపోవడం
భారీగా ఉన్న యాక్షన్ సీన్స్

రేటింగ్: 2.75 / 5
ట్యాగ్ లైన్: ఫన్నీ రౌడీ!

Show comments