NTV Telugu Site icon

రివ్యూ: సీటీమార్

గత కొంతకాలంగా మంచి కమర్షియల్ హిట్ కోసం గోపీచంద్ ఎదురు చూస్తున్నాడు. అలానే ‘గౌతమ్ నంద’ తర్వాత మంచి సక్సెస్ ఫుల్ మూవీ కోసం డైరెక్టర్ సంపత్ నంది ప్రయత్నిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో సెకండ్ మూవీగా తెరకెక్కింది ‘సీటీమార్’. గతంలో పూరి దర్శకత్వంలో ‘గోలీమార్’లో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన గోపీచంద్ ఇప్పుడీ ‘సీటీమార్’లో కబడ్డి కోచ్ గా నటించాడు.

బేసికల్ గా కబడ్డీ ఆటగాడైన కార్తీక్ (గోపీచంద్) ఆంధ్రా బ్యాంక్ లో ఉద్యోగి. సాయంత్రమైతే చాలు తన వూరిలోని అమ్మాయిలకు కబడ్డీ కోచ్ గా మారిపోతాడు. రామకృష్ణ మెమోరియల్ హైస్కూల్ లో చదువుకున్న ఈ అమ్మాయిలను నేషనల్ లెవెల్ కబడ్డీ ఛాంపియన్స్ గా నిలబెట్టి, తద్వారా తమ వూరికి, ఆ స్కూల్ కు గుర్తింపు తీసుకురావాలన్నది అతని కోరిక. కార్పొరేటీకరణ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న తరుణంలో కార్తీక్ చేసే ఈ ప్రయత్నం ఎలా సఫలీకృతం అయ్యిందన్నదే ‘సీటీమార్’ సినిమా.

తమ ఊరి క్రీడా మైదానం కాపాడుకోవడం కోసం హాకీ స్టిక్ పట్టిన అమ్మాయిల కథతో ఈ యేడాది మార్చిలో ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’ మూవీ వచ్చింది. అలానే చాలాకాలం క్రితమే తమ హైస్కూల్ గ్రౌండ్ ను కాపాడుకోవడానికి క్రికెట్ ఆడే కుర్రాళ్ళ కథతో ‘గోల్కొడ హైస్కూల్’ వచ్చింది. సహజంగా క్రీడా నేపథ్యంలో తెరకెక్కే ఇలాంటి సినిమాలలో హీరోకు ఫ్లాష్ బ్యాక్ లో ఏదో ఒక చేదు అనుభవం ఉంటుంది. బాలీవుడ్ లో తెరకెక్కిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ స్టోరీస్ కూడా ఇంతే. కానీ ఇందులో మాత్రం హీరోకు అలాంటి చేదు అనుభవాలు ఏమీ ఉండవు. తన తండ్రి కట్టించిన స్కూల్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి, దానిని మనుగడకు ఆ గుర్తింపు ఉపయోగపడుతుందనే ఆశ తప్ప. ఆ మధ్య వచ్చిన ‘విజిల్’ మూవీలో ఫుట్ బాల్ క్రీడాకారులను విజయ్ ఎలా ట్రైనప్ చేస్తాడో అదే ఇందులోనూ మనకు కనిపిస్తుంది. మెరికల్లాంటి అమ్మాయిలను ఎంపిక చేసి కార్తీక్ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాడు. అందులో విజయ్ ఆ అమ్మాయిలను కన్వెన్స్ చేయడానికి ప్రయత్నిస్తే, ఇందులో ఆ పని కార్తీక్… కబడ్డీ ఆడే అమ్మాయిల తల్లిదండ్రులను కన్వెన్స్ చేస్తాడు. మొత్తం మీద న్యూఢిల్లీకి కబడ్డీ నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీకి తీసుకెళ్లిన అమ్మాయిలతో కార్తీక్ కప్ గెలవడంతో సినిమా సుఖాంతం అవుతుంది. కబడ్డీ క్రీడను ఎలివేట్ చేయడంతో పాటు మహిళా సాధికారికత గురించి కూడా ఈ సినిమాలో చూపించారు. మరీ ముఖ్యంగా మహిళలు క్రీడాకారులుగా మారితే వారి వ్యక్తిత్వం ఎలా వికసిస్తుందో చూపించే ప్రయత్నం చేశారు.

సినిమా ప్రథమార్థంను వినోద ప్రధానంగా తెరకెక్కించిన దర్శకుడు సంపత్ నంది ద్వితీయార్థంకు వచ్చే సరికీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా దాన్ని మార్చేశారు. కార్తీక్ కు అతని అక్క, బావలకు ఉండే అనుబంధాన్ని చూపిస్తూనే, కబడ్డి పోటీ కోసం ఢిల్లీ వెళ్ళిన అమ్మాయిలు కిడ్నాప్ కావడం, దానికి పోలీస్ ఆఫీసర్ అయిన అతని బావ గతంతో ముడిపెట్టడంతో హీరో పాత్రలోనూ, అతను చేసే పోరాటంలోనూ మరింత ఇంటెన్సిటీ పెరిగింది. కేవలం దీన్ని ఓ స్పోర్ట్స్ డ్రామాగా మలిచి వదిలేకుండా, దానికి పోలీస్ కథను మిళితం చేయడంతో ద్వితీయార్థం ఆసక్తికరంగా మారింది. కిడ్నాప్ కు గురైన అమ్మాయిలను కార్తీక్ ఎలా రక్షిస్తాడు? అనుకున్న సమయానికి వారిని క్రీడామైదానంలోకి ఎలా తీసుకొచ్చాడు? అనే విషయంలో టెంపోను మెయిన్ టైన్ చేశారు. సినిమా ద్వారా చెప్పాల్సిన సందేశాన్ని చెబుతూనే ఎంటర్ టైన్ మెంట్ కు, యాక్షన్ కూ సమపాళ్లలో ప్రాధాన్యమిచ్చారు. దాంతో కొన్నిచోట్ల పాత్రలు అతిగా ప్రవర్తించినా, కమర్షియల్ యాంగిల్ లో వాటిని పెద్దంతగా పట్టించుకోనక్కర్లేదు.

నటీనటుల విషయానికి వస్తే… కబడ్డీ కోచ్ గా గోపీచంద్ ఫిట్ గా ఉన్నాడు. అంతేకాదు… బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గా డీఫాల్టర్ కడియం బ్రదర్ కు నీళ్ళు తాగించే సన్నివేశంలోనూ పంచ్ డైలాగ్స్ తో మెప్పించాడు. గోపీచంద్ ను ‘గౌతమ్ నంద’ తర్వాత మరోసారి కమర్షియల్ హీరోగా నిలబెట్టేందుకు సంపత్ నంది గట్టి ప్రయత్నమే చేశాడు. పోరాట సన్నివేశాలలో అది కనిపిస్తోంది. అదే సమయంలో మూవీ ఫస్ట్ హాఫ్ లో కబడ్డీ ప్లేయర్స్ పై చిత్రీకరించిన ఫైట్ కూడా ఆసక్తికరంగా ఉంది. తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్ గా నటించిన తమన్నా జ్వాలా రెడ్డి పాత్ర కాస్తంత ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా, ద్వితీయార్థంలో హీరోకి బ్యాక్ బోన్ గా నిలబడటంతో ఆ పాత్ర ప్రాధాన్యం పెరిగింది. హీరోని అభిమానించే లోకల్ న్యూస్ ఛానెల్ యాంకర్ గా దిగంగన సూర్యవంశీ చలాకీగా నటించింది. ఇక హీరో ఇంటి సభ్యులుగా ప్రగతి, అన్నపూర్ణ తదితరులు దిగంగన పెళ్ళిని చెడగొట్టే సీన్ లో కామెడీని బాగానే పండించారు. అక్కడ అన్నపూర్ణమ్మ పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టారు. హీరోని లోకల్ గా వ్యతిరేకించే కడియం బ్రదర్ గా రావు రమేశ్ తనదైన శైలిలో సంభాషణలు పలికి మెప్పించారు. హీరో అక్క,బావగా భూమిక, రెహమాన్ చక్కగా నటించారు. విలన్ పాత్రలో తరుణ్‌ అరోరా భయపెట్టాడు. అంకిత మహారాణా పై చిత్రీకరించిన ‘పెప్సీ ఆంటీ’ ఐటమ్ సాంగ్ మాస్ ను ఆకట్టుకునేలా ఉంది. అలానే జ్వాలారెడ్డి పాట కలర్ ఫుల్ గా ఉంటే, టైటిల్ సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది. మణిశర్మ బాణీలు, నేపథ్య సంగీతం సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్ళాయి. సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ కన్నుల పండగగా ఉంది. బేసికల్ గా రైటర్ అయిన సంపత్ నంది ఎప్పటిలానే హృదయానికి హత్తుకునేలా, కర్తవ్య బోధ చేసేలా సంభాషణలు రాసి మెప్పించాడు. సినిమాలోని లూప్ హోల్స్ జోలికి పోకుండా కమర్షియల్ యాంగిల్ లో చూస్తే… ఇది మాస్ ఆడియెన్స్ తో ‘సీటీమార్’ కొట్టించే చిత్రమే!

ప్లస్ పాయింట్
కబడ్డీ నేపథ్య చిత్రం కావడం
గోపీచంద్ నటన
మణిశర్మ సంగీతం
రోమాంచితమైన యాక్షన్ సీన్స్

మైనెస్ పాయింట్
కథలో కొత్తదనం లేకపోవడం
ప్రిడిక్టబుల్ క్లయిమాక్స్

రేటింగ్ : 2.75 / 5

ట్యాగ్ లైన్: కూత మొదలైంది!

Show comments