మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆకస్మిక మరణానికి రాజకీయ, సినీ, సామాజిక రంగ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రోశయ్య పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. రోశయ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లి సమీపంలో శామీర్ పేట్ మండలంలోని దేవరయాంజల్ గ్రామంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. స్టార్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో రోశయ్య పార్థివదేహాన్ని అమీర్‌పేటలోని ఆయన నివాసానికి తరలించారు.
ఆదివారం ఉదయం గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయాన్ని తీసికెళ్ళి ప్రజలు, పార్టీ నేతల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచుతారు. మధ్యాహ్నం 12.30 తర్వాత గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు రోశయ్య అంత్యక్రియలు కొంపల్లి దేవరయంజాల్ ఫాం హౌస్‌లో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేత కేవీపీ వెల్లడించారు. రోశయ్య సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు చెప్పారు. రోశయ్య మరణవార్త తనను ఎంతగానో బాధించిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఉమ్మడి ఏపీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా.. సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని చెప్పారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు జగన్ వివరించారు. అన్ని పార్టీల నేతలు తమ సంతాపం తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సంతాప సందేశం పంపారు.
