Site icon NTV Telugu

తెలంగాణ కాంగ్రెస్‌ లో చిచ్చు పెట్టిన ”ఈటల” ?

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓటమి తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది. నాయకుల మధ్య ఉన్న విభేదాలను మరోసారి భగ్గుమనేలా చేసింది. ఓటమికి గల కారణాలపై చర్చించేందుకు ఢిల్లీకి పిలిచిన అధిష్టానం, తెలంగాణ నాయకులతో వార్‌రూమ్‌లో సుధీర్ఘంగా చర్చించింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక దానికి ముందూ, వెనుకా జరిగిన పరిణామాలన్నింటిపైనా ఆరా తీసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ముందు జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పంచాయితీలో టీ.కాంగ్‌ నేతలు ఉత్తమ్‌, రేవంత్‌ వర్గాలుగా విడిపోయారు. ఓటమికి కారణం నువ్వంటే నువ్వే అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు.

కాంగ్రెస్‌లోఉండి కొందరు నేతలు టీఆర్‌ఎస్‌కు సహకరిస్తున్నారంటూ ఉత్తమ్‌పై అధిష్టానం ముందే ఆరోపణలు చేశారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌. టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలని కౌశిక్‌ రెడ్డిని ప్రోత్సహించడమే కాకుండా, ఎమ్మెల్సీ పదవిని కూడా ఇప్పించారని ఆరోపించారు పొన్నం. స్థానిక నాయకులను కాదని కౌశిక్‌కు పార్టీలో ఇచ్చిన పదవుల ఉత్తర్వులను వేణుగోపాల్‌కి అందించారు. దీనిపైన ప్రస్తుత ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా సీరియస్‌గానే రియాక్టయ్యారు. కౌశిక్‌రెడ్డి పార్టీని వదిలి నాలుగు నెలలు అయినా.. హుజూరాబాద్‌లో అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. ఉత్తమ్‌కి సీఎల్పీ నేత భట్టి, శ్రీధర్‌బాబు, మధు యాష్కిలు మద్దతుగా నిలబడితే, మిగతా నేతలు రేవంత్‌ వైపు ఉన్నారు.

ఇదిలా ఉంటే, కొండా సురేఖకు టికెట్‌ ఎందుకివ్వలేదో చెప్పాలంటూ వీహెచ్‌ ప్రశ్నించారు. సురేఖ రాహుల్‌కు రాసిన లేఖను కేసీ వేణుగోపాల్‌కు అందించారు. ఇదిలా ఉంటే, ఈటెలను కాంగ్రెస్‌లోకి రాకుండా అడ్డుకున్నారంటూ కొందరు నేతలు ఏసీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ బీజేపీలు వందల కోట్లు కుమ్మరించాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసిన కేసీ వేణుగోపాల్‌, చివరకు ఓటమిపై కారణాలు వెతికేందుకు ఏఐసీసీ పర్యవేక్షకుడిని నియమిస్తామని తెలిపారు.


తెలంగాణ నేతలతో విడివిడిగా మాట్లాడిన కే.సీ. వేణుగోపాల్‌ ఓటమిపై సోనియాకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. సీనియర్ల సహకారంతో కలిసికట్టుగా పనిచేస్తామని, బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య రహస్య ఒప్పందన్ని బయట పెట్టే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పుకొచ్చారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.


హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓటమికి గల కారణాలపై జరగాల్సిన చర్చ కంటే, నాయకుల మధ్య విభేదాలపైనే ఎక్కువసేపు సాగింది. చివరకి నివేదిక ఇచ్చే బాధ్యత ఏఐసీసీ పర్యవేక్షకుడిని చేతికి వెళ్లింది. ఇటు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఇంఛార్జ్‌గా ఉన్న తనను సమీక్షకు పిలవక పోవడంపై జగ్గారెడ్డి మండిపడుతున్నారు. అధిష్టానానికి ఆయన లేఖ రాశారు.

Exit mobile version