Site icon NTV Telugu

హుజురాబాద్ బైపోల్: గెలుపు క్రెడిట్ ఈటలదా? బీజేపీదా?

హుజురాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఘనవిజయం సాధించారు. ఈ గెలుపుతో అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేల సంఖ్య 3కి చేరిందని కమలం పార్టీ నేతలు పొంగిపోతున్నారు. అయితే నిజంగా హుజురాబాద్‌లో బీజేపీ గెలిచిందా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. సాంకేతికంగా మాత్రమే బీజేపీది గెలుపుగా భావించాలి. దీనికి కారణం ఈటల రాజేందర్. నిజానికి ఈ ఉప ఎన్నిక రాజకీయ పార్టీల మధ్య జరగలేదు. కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్‌గానే సాగింది. అందుకే ఈ గెలుపును చూసి బీజేపీ ఎంతమాత్రం పొంగిపోవాల్సిన అవసరం లేదనే వాదన వినిపిస్తోంది.

గతంలో హుజురాబాద్‌లో బీజేపీకి కనీసం క్యాడర్ లేదు. అక్కడ జరిగిన ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్లు తెచ్చుకున్న దాఖలాలు కూడా లేవు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్‌లో బీజేపీకి వచ్చిన ఓట్లు 1,683 మాత్రమే. అయితే ఈటల రాజేందర్ చేరిన తర్వాత బీజేపీకి ఉన్న అరకొర నేతలు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో హుజురాబాద్‌లో ఈటల అంటే బీజేపీ.. బీజేపీ అంటే ఈటల అని ప్రచారం సాగింది. అంతేకాకుండా ప్రచారం సమయంలోనూ ఈటల ఎక్కడా బీజేపీ గురించి ప్రస్తావన తీసుకురాలేదు. కేవలం గుర్తు గురించి మాత్రమే ప్రచారం చేశారు.

పైగా టీఆర్ఎస్ పార్టీ నేతలు ఈటలపై కాకుండా బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. పెట్రోల్, గ్యాస్ రేట్లు పెరగడానికి కారణం బీజేపీ అని మంత్రి హరీష్‌ రావు స్వయంగా విమర్శలు చేశారు. అయితే ఈటల మాత్రం ఈ ఎన్నిక బీజేపీకి సంబంధించింది కాదని.. తన ఆత్మగౌరవానికి సంబంధించిందనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగారు. మరోవైపు ఈటల బీజేపీ నుంచి కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే బాగుండేదని పలువురు సూచించారు. దీన్ని బట్టి హుజురాబాద్ విజయం క్రెడిట్ ముమ్మాటికీ ఈటలదే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఈటల గెలుపుతో బీజేపీ తెలంగాణలో మళ్లీ పుంజుకుందని చెప్పలేం. గతంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో కూడా బీజేపీ గెలిచిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు కూడా రఘునందన్‌రావును చూసే ప్రజలు ఓట్లు వేశారు తప్పితే.. బీజేపీకి కాదు. కానీ ఈ విషయాన్ని బీజేపీ గాలికొదిలేసింది. నిజంగా బీజేపీ తెలంగాణలో బలపడితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటి ఉండేది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాన్ని కూడా కమలం పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీకి ఈ ఉప ఎన్నిక ప్లస్ అవుతుందో లేదో అన్న విషయం పక్కన పెడితే.. ఉద్యమనాయకుడిగా ఈటలకు ఉన్న గుర్తింపును ఈ ఉప ఎన్నిక మరింత పెంచుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Read Also: బద్వేల్ బైపోల్: కుదేలైన జాతీయ పార్టీలు

Exit mobile version