దీపావళి అంటే దీపాల వెలుగులు, కొత్త బట్టలు, పిండి వంటలు, టపాసుల సందడి మాత్రమే కాదు.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక కూడా. అయితే దీపావళి పండుగను దేశమంతా ఒకే కథతో గుర్తు చేసుకోరు. ఉత్తర భారతదేశంలో శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంతో దీపావళిని అనుసంధానిస్తే.. దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన కథకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా నరక చతుర్దశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, నూనె స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి పండుగను జరుపుకోవడం వెనుక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది.
అసలు ఎవరీ నరకాసురుడు?
హిందూ పురాణాల ప్రకారం నరకాసురుడిని భౌమాసురుడు అని కూడా పిలుస్తారు. భూదేవి కుమారుడిగా చెప్పుకునే నరకాసురుడు.. ప్రజ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని శక్తివంతమైన పాలకుడిగా ఎదిగాడు. అయితే కాలక్రమంలో అతడిలో అహంకారం పెరిగి, క్రూరమైన పాలన సాగించినట్లు పురాణ కథనాలు చెబుతాయి.
నరకాసురుడు చేసిన అకృత్యాల్లో దేవతల తల్లి అదితి చెవికుండలాలను అపహరించడం, వరుణుడి ఛత్రాన్ని స్వాధీనం చేసుకోవడం, వేలాది మంది మహిళలను బందీలుగా ఉంచడం వంటి ఘటనలు ఉన్నాయి. అతడి దౌర్జన్యాలు పెరిగిపోవడంతో దేవలోకంలోనూ ఆందోళన మొదలైంది. నరకాసురుడి ఆగడాలను భరించలేక ఇంద్రుడు శ్రీకృష్ణుడిని ఆశ్రయించి సాయం కోరినట్లు భాగవత పురాణం వివరిస్తుంది.
నరకాసురుడితో కృష్ణుడి భీకర యుద్ధం
నరకాసురుడి అకృత్యాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్న శ్రీకృష్ణుడు.. గరుడ వాహనంపై అతడి రాజ్యానికి బయలుదేరాడు. ఈ ప్రయాణంలో ఆయన భార్య సత్యభామ కూడా వెంట ఉన్నట్లు పురాణ కథనం చెబుతుంది. నరకాసురుడి రాజధాని బలమైన రక్షణ వ్యవస్థలు, భీకర యోధులతో కాపలా ఉన్న ప్రాంతంగా వర్ణించబడింది.
నగరంలోకి ప్రవేశించే క్రమంలో ముందుగా కృష్ణుడు మురాసురుడిని సంహరించాడు. ఆ తర్వాత నరకాసురుడితో భీకర యుద్ధం జరిగింది. చివరికి శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో నరకాసురుడిని సంహరించినట్లు భాగవత పురాణం వివరిస్తుంది. నరకాసురుడి మరణంతో బందీలుగా ఉన్న మహిళలకు విముక్తి లభించింది. అపహరణకు గురైన అదితి చెవికుండలాలను కూడా కృష్ణుడు తిరిగి అందించాడు. అనంతరం నరకాసురుడి కుమారుడు భగదత్తుడికి రాజ్యాన్ని అప్పగించినట్లు కథనం చెబుతుంది. ఈ కథలోని ప్రధాన సందేశం ఒక్కటే.. ఎంతటి శక్తి ఉన్నా, అహంకారం, క్రూరత్వం, అధర్మం చివరకు పతనానికే దారితీస్తాయని చెప్పడం.
నరకాసురుడి వధలో సత్యభామ పాత్ర ఏంటి?
నరకాసురుడి వధ కథలో సత్యభామ పాత్రకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పురాణ కథనాలు, జానపద సంప్రదాయాల్లో సత్యభామను నరకాసురుడి సంహారంతో కీలకంగా అనుసంధానిస్తారు. ప్రచారంలో ఉన్న ఒక కథనం ప్రకారం.. నరకాసురుడికి తన తల్లి చేతిలోనే మరణం సంభవిస్తుందనే వరం ఉంటుంది. సత్యభామ భూదేవి అంశగా భావించే సంప్రదాయంలో.. ఆమె నరకాసురుడి వధలో కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని కథనాల్లో ఆమెనే నరకాసురుడిపై తుది దెబ్బ కొట్టినట్లు చెబుతారు.
అందుకే పలు కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనల్లో సత్యభామ కృష్ణుడితో కలిసి యుద్ధం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. అయితే అన్ని పురాణ కథనాల్లోనూ ఈ వివరణ ఒకేలా ఉండదు. భాగవత పురాణంలో నరకాసురుడిని సంహరించినది శ్రీకృష్ణుడిగా వర్ణించగా.. సత్యభామ తుది దెబ్బ కొట్టిన కథనం ప్రాంతీయ సంప్రదాయాల్లో ప్రాచుర్యంలో ఉంది.
నరక చతుర్దశి ఎందుకు జరుపుకుంటారు?
కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. నరకాసురుడిపై శ్రీకృష్ణుడు సాధించిన విజయాన్ని గుర్తు చేసుకునే రోజుగా దీనికి ప్రాధాన్యం ఉంది. అధర్మంపై ధర్మం, చీకటిపై వెలుగు, అణచివేతపై విముక్తి సాధించిన విజయంగా ఈ పండుగను భావిస్తారు.
దీపావళి వేడుకల్లో నరక చతుర్దశి ఒక ముఖ్యమైన భాగం. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజును ఛోటీ దీపావళి అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలోని అనేక కుటుంబాల్లో మాత్రం తెల్లవారుజామున చేసే ఆచారాలు దీపావళి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రాంతాలను బట్టి పండుగ ఆచారాలు, కథనాలు మారినా.. చెడును విడిచిపెట్టి మంచిని ఆహ్వానించాలనే భావన మాత్రం అందరిలోనూ ఒకేలా కనిపిస్తుంది.
తెల్లవారుజామున నూనె స్నానం ఎందుకు?
దీపావళి సందర్భంగా దక్షిణ భారతదేశంలో కనిపించే ముఖ్యమైన ఆచారాల్లో అభ్యంగ స్నానం ఒకటి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి శరీరానికి, తలకు నువ్వుల నూనె రాసుకుని స్నానం చేస్తారు. ఆ తర్వాత కొత్త బట్టలు ధరించి, పూజలు నిర్వహించి పండుగను ప్రారంభిస్తారు.
ఈ నూనె స్నానాన్ని శుద్ధికి, ప్రతికూలతలను తొలగించుకోవడానికి ప్రతీకగా భావిస్తారు. నరకాసురుడిని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు స్నానం చేసి శుద్ధి పొందాడనే ప్రజల్లో ప్రాచుర్యంలో ఉన్న విశ్వాసంతోనూ ఈ ఆచారాన్ని అనుసంధానిస్తారు. స్నానం తర్వాత ఇంట్లో పూజలు, దీపాలంకరణ, పిండివంటలు, మిఠాయిల తయారీతో పండుగ సందడి మొదలవుతుంది. బంధువులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొన్ని ప్రాంతాల్లో బాణసంచా కాల్చడం కూడా వేడుకల్లో భాగంగా ఉంటుంది.
నరకాసురుడి కథ చెప్పే సందేశం ఇదే
నరకాసురుడి వధ కథ కేవలం ఒక రాక్షసుడి మరణానికి సంబంధించిన పురాణ గాథ మాత్రమే కాదు. అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఇతరులను బాధించడం, అహంకారంతో నడుచుకోవడం చివరకు వినాశనానికి దారితీస్తాయని గుర్తుచేసే కథగా దీనిని భావిస్తారు.
శ్రీకృష్ణుడు ధర్మానికి, జ్ఞానానికి ప్రతీకగా కనిపిస్తే.. నరకాసురుడు అహంకారం, క్రూరత్వం, అధికార దుర్వినియోగానికి ప్రతీకగా నిలుస్తాడు. నరకాసురుడి ఓటమి అంటే చెడును తొలగించి న్యాయాన్ని తిరిగి స్థాపించడం అనే ఆధ్యాత్మిక భావన ఇందులో కనిపిస్తుంది. శ్రీరాముడి అయోధ్య రాకను గుర్తుచేసుకున్నా.. శ్రీకృష్ణుడి నరకాసుర వధను స్మరించుకున్నా.. దీపావళి ఇచ్చే సందేశం మాత్రం ఒక్కటే. చీకటిపై వెలుగు గెలవాలి.. చెడుపై మంచి విజయం సాధించాలి. మనలోని ప్రతికూల ఆలోచనలను పక్కనపెట్టి, కొత్త ఆశలతో ముందుకు సాగాలి. అందుకే నరక చతుర్దశి నుంచి దీపావళి వరకు సాగే ఈ పండుగ.. దీపాల వెలుగులకే కాదు, మనసుల్లో మంచి ఆలోచనలను వెలిగించే పండుగగానూ ప్రత్యేకతను సంతరించుకుంది.

