(ఆగస్టు 17న ‘జెంటిల్ మేన్’ శంకర్ బర్త్ డే)
అలాగ వచ్చి, ఇలాగ మెచ్చే చిత్రాలను రూపొందించి జనం మదిలో చెరిగిపోని స్థానం సంపాదిస్తారు కొందరు. వారిని అదృష్టవంతులు అనుకుంటాం. కానీ, ప్రేక్షకులను ఆకట్టుకొనేలా సినిమాలను తెరకెక్కించడం వెనుక వారి కృషి, దీక్ష, పట్టుదలను మరచిపోరాదు. తొలి చిత్రం ‘జెంటిల్ మేన్’తోనే తనదైన బాణీ పలికించిన దర్శకుడు శంకర్ తెలుగునాట సైతం తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. మొట్టమొదటిసారి తెలుగులో ఓ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నారాయన. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. శంకర్ చిత్రాలను గమనిస్తే, వాటిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ చిందులు వేస్తూ ఉంటుంది. అందుకే కొందరు ఆయనను ‘హై టెక్ డైరెక్టర్’ అన్నారు. ఆ మాటను నిలుపుకుంటూనే శంకర్ తనదైన పంథాలో పయనిస్తున్నారు.
శంకర్ కు బాల్యం నుంచీ సినిమాలంటే ఎంతో అభిమానం. ఆయన అభిమాన నటుడు ఎమ్జీఆర్. సినిమాలు చూడడం, వాటిలోని సీన్స్ కు సొంతగా తాను రచన చేసి ఆనందించేవారు. చదువుకొనే రోజుల్లోనే మిత్రులతో కలసి నాటకాలు వేసేవారు. అలా చేస్తూనే మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశారు శంకర్. ఆయన రాసిన ఓ నాటకం చూసిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్, శంకర్ ను చిత్రసీమకు ఆహ్వానించారు. అలా రచయితగా అడుగు పెట్టిన శంకర్ తరువాత కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. ఆపై ఎస్.ఏ.చంద్రశేఖర్, పవిత్రన్ వద్ద అసోసియేట్ గా పనిచేశారు. మెల్లగా తన ఆలోచనలకు తగ్గ కథలు రాసుకుంటూ ముందుకు సాగారు. కొత్తవారిని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్న కె.టి.కుంజుమోన్ కు శంకర్ తన ‘జెంటిల్ మేన్’ కథ వినిపించారు. అది ఆయనకు నచ్చడం, తరువాత శంకర్ కోరినవన్నీ సమకూర్చడం ఇట్టే జరిగిపోయాయి. ఈ సినిమాను తెలుగులో ఎ.ఎమ్.రత్నం అదే టైటిల్ తో డబ్ చేశారు. ‘జెంటిల్ మేన్’ తమిళ, తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ చిత్రానికి ఎ.ఆర్.రహమాన్ స్వరకల్పన పెద్ద ఎస్సెట్ గా నిలచింది. ‘జెంటిల్ మేన్’లో “చుకు బుకు చుకు బుకు రైలే…” పాటలో స్సెషల్ ఎప్పియరెన్స్ ఇచ్చిన డాన్స్ మాస్టర్ ప్రభుదేవాను ‘కాదలన్’తో హీరోని చేసేశారు శంకర్. ఈ సినిమా తెలుగులో ‘ప్రేమికుడు’ పేరుతో అనువాదమై అలరించింది. శంకర్ రెండు చిత్రాలను తెలుగులోకి అనువదించిన ఎ.ఎమ్.రత్నం ఆయన మూడో చిత్రాన్ని నిర్మించారు. అదే ‘ఇండియన్’. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా తెలుగులో ‘భారతీయుడు’ పేరుతో విడుదలై ఇక్కడా విజయఢంకా మోగించింది. ఈ మూడు చిత్రాలకు ఎ.ఆర్.రహమాన్ ప్రాణం పోసిందనే చెప్పాలి. ఈ సినిమాల్లో శంకర్ పనితనం జనాన్ని ఇట్టే పట్టేసింది. దాంతో శంకర్ సినిమా కోసం జనం ఆసక్తిగా ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది.
‘ఇండియన్’ తరువాత ‘జీన్స్’తోనూ మురిపించారు శంకర్. ఈ సినిమా అయ్యాక నిర్మాతగా మారారు శంకర్. తన తొలి హీరో అర్జున్ తో ‘ముదలవాన్’ నిర్మించారు. ఈ సినిమా తెలుగులో ‘ఒకే ఒక్కడు’గా అనువాదమై అక్కడా, ఇక్కడా ఘనవిజయం సాధించింది. శంకర్ కు తిరుగులేదు అన్నట్టుగా సాగిపోయారు. ఆయనతో సినిమాలు చేయడానికి టాప్ స్టార్స్ ఎందరో ఆసక్తి చూపించారు. అయితే ‘ఒకే ఒక్కడు’ను హిందీలో ‘నాయక్’ పేరుతో శంకర్ దర్శకత్వంలోనే రీమేక్ చేశారు ఎ.ఎమ్.రత్నం. ఆ సినిమా ఫ్లాప్ అయింది. శంకర్ కెరీర్ లో తొలి ఫ్లాప్ గా ‘నాయక్’ నిలచింది.
ఎమ్జీఆర్ తరువాత తాను ఎంతగానో అభిమానించే రజనీకాంత్ తో సినిమా తీయాలని శంకర్ తపించారు. ఆయన కోసం ‘శివాజీ’ కథ తయారు చేసుకున్నారు. మధ్యలో కుర్రకారుతో ‘బోయ్స్’ తీస్తే అది యువతను మాత్రం ఆకట్టుకోగలిగింది. రజనీకాంత్ తో శంకర్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘శివాజీ’ మంచివిజయం సాధించింది. భారీ వసూళ్ళు చూసినా, ‘భారతీయుడు’ స్థాయిలో శంకర్ కు పేరు సంపాదించలేకపోయింది. తన అభిమాన హీరోతో ఎలాగైనా భారీ హిట్ పట్టాలని శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘యందిరన్’. ఇదే తెలుగులో ‘రోబో’గా అనువాదమై అఖండ విజయం చూసింది. ‘శివాజీ, రోబో’ రెండు చిత్రాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి. తరువాత ఎందుకనో శంకర్ హిందీలో విజయం సాధించిన ‘3 ఇడియట్స్’ను ‘నన్బన్’ పేరుతో రీమేక్ చేశారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన తొలి రీమేక్ ఇది. తెలుగులో ‘స్నేహితుడు’గా వచ్చింది. అంతగా ఆకట్టుకోలేకపోయింది. విక్రమ్ తో అంతకు ముందు ‘అపరిచితుడు’ తీసి విజయం సాధించిన శంకర్, తరువాత ఆయనతో ‘ఐ’ తెరకెక్కించారు. ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ‘రోబో’ సీక్వెల్ గా రజనీకాంత్ తోనే ‘2.0’ తెరకెక్కించారు శంకర్. ఇది కూడా ఓపెనింగ్స్ తోనే సరిపుచ్చుకోవలసి వచ్చింది. నిర్మాతగా తన అసోసియేట్స్ డైరెక్షన్ లోనూ సినిమాలు నిర్మించారు శంకర్.
ప్రస్తుతం ‘ఇండియన్’ సీక్వెల్ గా ‘ఇండియన్ 2’ తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం కారణంగా ఈ సినిమా నిర్మాణంలో జాప్యం జరిగింది. రామ్ చరణ్ తో దిల్ రాజు నిర్మించే చిత్రంతో తొలిసారి తెలుగు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు శంకర్. ఇప్పటికే తెలుగునాట తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న శంకర్ మరి ఈ సినిమాతో తెలుగువారిని ఏ రీతిన మెప్పిస్తారో చూడాలి.