ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతుండటంతో రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. వాహనాలు రోడ్డుమీదకు వచ్చిన సమయంలో తప్పని సరిగా వాహనాలకు సంబంధించిన పొల్యూషన్ అండ్ కంట్రోల్ సర్టిఫికెట్ తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలని, వాహనాలను చెక్ చేసిన సమయంలో పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే ఆరునెలల పాటు జైలుశిక్ష లేదా రూ 10 వేల రూపాయల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని ఢిల్లీ రవాణా శాఖ తెలియజేసింది. సరైన పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే లైసెన్స్‌ను మూడు నెలల పాటు రద్దు చేసే అవకాశం లేకపోలేదని రవాణ శాఖ హెచ్చరించింది.
Read: గ్లోబల్ వార్మింగ్: 2100 నాటికి 63 కోట్ల మందిపై ప్రభావం…
నిత్యం రోడ్లపైకి లక్షలాది వాహనాలు వస్తున్నాయి. రోజువారి గాలి కాలుష్యం ఢిల్లీ నగరంలో పెరిగిపోతున్నది. అత్యంత తీవ్రమైన కాలుష్యం కలిగిన నగరాల్లో ఢిల్లీ కూడా ఉండటంతో సర్కార్ కీలక చర్యలు తీసుకునేందుకు సిద్ధమయింది. గతంలో కొన్ని రోజులపాటు సరిబేసి విధానాన్ని అమలు చేసింది. ఈ విధానం వలన వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నా కొంతవరకు పొల్యూషన్ కంట్రోల్ అయింది. ఇక కరోనా లాక్ డౌన్ కాలంలో గాలిలో కాలుష్యం చాలా వరకు తగ్గిపోయింది. నదిలోని నీరు స్వచ్ఛంగా మారింది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత క్రమంగా మరలా కాలుష్యం పెరుగుతూ వచ్చింది.
