ఇటీవల విడుదలైన ‘రాజ రాజ చోర’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది మేఘా ఆకాశ్. మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ‘లెవన్త్ అవర్’ వెబ్ సీరిస్ లో కీలక పాత్ర పోషించాడు అరుణ్ అదిత్. వీరిద్దరితో పాటు అర్జున్ సోమయాజులు ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘డియర్ మేఘ’. ఈ ముక్కోణ ప్రేమకథా చిత్రం శుక్రవారం విడుదలైంది.
మేఘ (మేఘా ఆకాశ్) బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్. తమ కాలేజీలో ఎంటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అర్జున్ (అర్జున్ సోమయాజుల)తో ప్రేమలో పడుతుంది. అయితే ఆమెది సైలెంట్ లవ్. మనసులోని ప్రేమను బయటకు వ్యక్తం చేయదు. ఇంతలో సింగపూర్ లో జాబ్ వచ్చి అర్జున్ చదువును అర్థాంతరంగా ఆపేసి వెళ్ళిపోతాడు. చిత్రంగా మూడేళ్ళ తర్వాత ముంబైలో తిరిగి మేఘ ముందు అర్జున్ ప్రత్యక్షమై తాను మేఘను ప్రేమిస్తున్నట్టు చెబుతాడు. అలాంటి అర్జున్ తిరిగి మేఘ జీవితంలోంచి ఎలా నిష్క్రమించాడు? ఆ స్థానాన్ని ఆది (అరుణ్ అదిత్) ఎలా ఫుల్ ఫిల్ చేశాడు? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎలాంటి ఫుల్ స్టాప్ పడింది? అనేది మిగతా కథ.
మేఘా ఆకాశ్ కు ఇలాంటి లవ్ స్టోరీలో నటించడం అలవాటైపోయింది. తెలుగులో చేసిన తొలి రెండు చిత్రాలు ‘లై’, ‘చల్ మోహన్ రంగ’, మొన్నొచ్చి ‘రాజ రాజ చోర’ చిత్రంలోనూ ఆమెది ఇలాంటి పాత్రే. అయితే… ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కావడంతో ఇందులో ఎమోషన్స్ పాలు కాస్తంత ఎక్కువ. ఆ భావోద్వేగాలను మేఘా ఆకాశ్ బాగానే పలికించింది. ఇక వెండితెరపై క్యూట్ గా కనిపించే హీరోయిన్లలో మేఘా ఆకాశ్ కూడా ఒకరు. ఈ సినిమా టైటిల్ రోల్ ఆమెదే కావడంతో దర్శకుడు, ఛాయాగ్రాహకుడు సైతం ఆమె పాత్రను తీర్చిదిద్దడంలోనూ, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. అరుణ్ అదిత్ చూడటానికి అచ్చం రామ్ లానే ఉంటాడు. అతని హెయిర్ స్టైల్ సైతం అలానే ఉంటుంది. దాంతో లాంగ్ షాట్స్ లో రామ్ ను చూస్తున్నామేమో అనిపిస్తుంటుంది. మామూలుగానే కెమెరాముందు యమ యాక్టివ్ గా ఉండే అరుణ్ ఇందులో అలాంటి సూపర్ యాక్టివ్ పాత్రనే చేశాడు. అతని తల్లిగా పవిత్రాలోకేశ్ కీలక పాత్ర పోషించింది. సమాజ సేవకురాలైన డాక్టర్ గా ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయింది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య చిత్రీకరించిన సెంటిమెంట్ సీన్స్ బాగా పండాయి. మరో ప్రధాన పాత్రను అర్జున్ సోమయాజుల పోషించాడు. అతనికి ఇది మొదటి సినిమా అయినా తెర మీద ప్లెజెంట్ గానే కనిపించాడు. ఆ రకంగా నటీనటుల నుండి చక్కని నటననే దర్శకుడు రాబట్టాడు.
సహజంగా ఇలాంటి ముక్కోణ ప్రేమకథా చిత్రాలు హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుండి సాగుతుంటాయి. కానీ దీనిని హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. దాంతో ప్రారంభం కాస్తంత కొత్తగా అనిపించింది. ఆ పైన అర్జున్ తన మనసులోని ప్రేమను వ్యక్తం చేయడం దగ్గర నుండి మళ్ళీ రొటీన్ ఫార్ములాలోకి వెళ్ళిపోయింది. పైగా ప్రేమికులు కలవడం, విడిపోవడం.. మళ్ళీ కలవడం, విడిపోవడం లాంటి దోబూచులాటలను చాలా సినిమాలో ఇప్పటికే చూసేశాం. దాంతో కొత్తదనం ఏమీ లేదు కదా! అనే భావన కలుగుతుంది. అయితే ఇందులో దర్శకుడు మదర్ సెంటిమెంట్ కు మంచి ప్రాధాన్యం ఇచ్చాడు. అది కాస్తంత హృదయానికి హత్తుకుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా జాలీ రైడ్ గా సాగే ఈ మూవీ… సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చే సరికీ హెవీ డ్రామాగా మారిపోతుంది. ఇక క్లయిమాక్స్ లో అయితే… దర్శకుడు మరీ ఇంత శాడిస్ట్ ఏమిటీ అనిపిస్తుంది. ఓ రకంగా భారమైన హృదయంతో జనం థియేటర్ల నుండి బయటకు వస్తారు.
‘డియర్ మేఘ’…. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన కన్నడ చిత్రం ‘దియా’కు రీమేక్. మాతృకలో డాక్టర్ గా నటించిన పవిత్రా లోకేష్ ఇక్కడా పేరున్న వ్యక్తే కావడంతో ఆమెతోనే ఆ పాత్రను చేయించారు. గతంలో ‘సూపర్ స్టార్ కిడ్నాప్’ అనే మూవీని డైరెక్ట్ చేసిన సుశాంత్ రెడ్డికి ఇది సెకండ్ మూవీ. అయితే కథను బాగానే తెరకెక్కించాడు. కానీ అందులో కొత్తదనం లేకపోవడమే మెయిన్ మైనెస్ పాయింట్. హరి గౌర నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్ ఐ అండ్రూ మనకున్న బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరు. క్లోజప్ సన్నివేశాలను సైతం చాలా అందంగా చూపించే ప్రయత్నం చేశారు. ఆయన కారణంగా మూవీకి విజువల్ రిచ్ రెస్ వచ్చింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఓకే. కాకపోతే… సెకండ్ హాఫ్ ను మరింత చకచకా నడపాల్సింది. నిర్మాత అర్జున్ దాస్యన్ చిత్ర నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదనే విషయంలో సినిమా చూస్తుంటే అర్థమౌతుంది. అయితే… కొత్తదనం లేని ఈ సినిమాను సాధారణ జనం ఎంతవరకూ ఆదరిస్తారనేది అనుమానమే. బట్… యూత్ కు కొంతలో కొంత నచ్చే ఆస్కారం ఉంది.
ప్లస్ పాయింట్స్
నటీనటులు నటన
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్
మైనెస్ పాయింట్స్
కథలో కొత్తదనం లేకపోవడం
హెవీగా మారిన సెకండ్ హాఫ్
రేటింగ్ : 2.25/ 5
ట్యాగ్ లైన్: మూడుముక్కలాట!