‘మా’ ఎలక్షన్స్ కు ఇంకా దాదాపు 3 నెలల సమయం ఉండగానే అసోసియేషన్ లో హీట్ పెరిగిపోయింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ముందే ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. అయితే ఈదారి జీవిత రాజశేఖర్, హేమ కూడా రేసులో ఉన్నారు. అంతేకాదు ప్రముఖ నటుడు సివిఎల్ నరసింహారావు ఈ జాబితాలో చేరి, తాను కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అతను తన మ్యానిఫెస్టోలో తెలంగాణ కళాకారుల కోసం సెపరేట్ స్టేటస్ ను తీసుకొచ్చి, తెలంగాణ వాదాన్ని విన్పించారు.
Read Also : కత్తి మహేష్ హెల్త్ రీహాబిలిటేషన్ కోసం ఫండ్ రైజింగ్
“నేను రాబోయే ‘మా’ ఎన్నికలలో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తాను. నేను తెలంగాణ కళాకారుల ప్రయోజనం కోసం పని చేస్తాను. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పేద, చిన్న కళాకారులు కూడా పరిశ్రమలో చాలా నష్టపోతున్నారు. నేను వారికి కూడా సహాయం చేస్తాను. నా మ్యానిఫెస్టోలోని ప్రధాన అంశాలలో ఒకటి స్థానిక కళాకారులకు మద్దతు ఇవ్వడం. సుమారు 10 సంవత్సరాల క్రితం హీరోయిన్ కాకుండా ఇద్దరు స్థానికేతర నటులను మాత్రమే నటించాలని మేము ఏకగ్రీవంగా నిర్ణయించాము. కానీ ఆ నియమాన్ని ఇప్పుడు పాటించడం లేదు. నేను దాన్ని అమలు చేస్తాను. ప్రస్తుతం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికీ వేర్వేరు భాషా బోర్డులు, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లు, సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అందువల్ల ‘మా’ కూడా దాని సభ్యుల నేపథ్యం ఆధారంగా విభజించబడాలి. రెండు విభాగాలకు ఎన్నికలు జరగాలి ”అని సివిఎల్ తెలిపారు. అయితే ఇప్పుడు బిజెపి సీనియర్ నాయకురాలు విజయశాంతి ఆయనకు తన మద్దతు తెలిపారు. విజయశాంతి తాను ‘మా’లో సభ్యురాలు కానప్పటికీ, సివిఎల్‌కు తన మద్దతు ఉంటుందని ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇప్పుడు ‘మా’ ఎన్నికలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయేమో అన్పిస్తోంది.
