Site icon NTV Telugu

కొత్త వేరియంట్‌ తో థర్డ్‌ వేవ్‌ ముప్పు..!

corona

corona

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఎనిమిది నెలల కనిష్టానికి కేసులు తగ్గాయి. ఇది సంతోషించాల్సిన విషయం. ఐతే, థర్డ్‌ వేవ్‌ భయాలు మాత్రం మనల్ని వీడలేదు. మరోసారి ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాంతో భయాలు కూడా ఎక్కువవుతున్నాయి. బ్రిటన్‌,రష్యా, చైనా, పాకిస్తాన్‌ వంటి దేశాలలో కొత్త వేరియంట్లు కలకలం రేపుతున్నాయి. ఇది ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

భారత్‌ను ఇప్పుడు థర్డ్‌ భయం వెంటాడుతోంది. ఇప్పటికే మన దేశంలో ప్రారంభమైందని కొందరు అంటున్నారు. ఐతే, నిపుణుల వద్ద దీనిపై ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ, ఇది అక్టోబర్‌లో ప్రారంభమై నవంబర్‌, డిసెంబర్‌ నాటికి శిఖరాగ్రానికి చేరుతుందని ఇప్పటికే అంచనా వేశారు. మొదట, ఈ పండగల సీజన్‌లో థర్డ్‌ వేవ్‌ వ్యాపిస్తుందని అనుకున్నారు. ఐతే, వినాయక చవితి, దసరా వంటి పెద్ద పండగలు ఇప్పటికే వెళ్లిపోయాయి. మరో వారం రోజులలో దీపావళి వస్తుంది. ఈ నేపథ్యంలో భయపడిన స్థాయిలో కేసులు పెరగలేదు. ఇది మరింత సంతోషించే విషయం. కానీ, కరోనా కొత్త రూపాల ముప్పు తొలగకపోవటం ఆందోళ కలిగించే అంశం.

తాజాగా డెల్టా వేరియంట్‌ ఏవై 4.2 రకం కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లో దీని ఉనికి బయటపడింది. ఆ రాష్ట్రంలోని ఇండోర్‌ నగరంలో ఈ రకానికి చెందిన ఆరు కేసులు నమోదయ్యాయి. బాధితులందరూ రెండు డోసులు కరోనా​ టీకా తీసుకున్నవారే. ఐనా వైరస్​ బారినపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దేశంలో ఏవై.4 రకం కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. గత నెలలో ఈ నమూనాలను పరీక్షలకు పంపగా అవి ఏవై.4 రకం అని తేలింది. ఐతే చికిత్స తర్వాత అందరూ కోలుకున్నారు. ఈ ఆరుగురితో సన్నిహితంగా ఉన్న మరో 50 మందికి కూడా పరీక్షలు నిర్వహించారు. వారు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఐతే, దీనికి సంబంధించి మన దగ్గర ఎక్కువ వివరాలు అందుబాటులో లేవు.

ఏవై.4 రకం కోవిడ్‌ వేరియంట్‌ కేసులు ఇప్పటికే బ్రిటన్‌లో పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న కొత్త కేసులలో ఆరు శాతం వరకు ఏవై 4.2 రకానికి చెందినవి ఉంటున్నాయి. ఒరిజినల్‌ డెల్టా కంటే 15 శాతం ఎక్కువగా వ్యాపించే శక్తి దీనికి ఉందంటున్నారు యూకే శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకు మనం చూసిన అన్ని వేరియంట్లలో కెల్లా దీని సంక్రమణ శక్తి అధికం. ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తుందనటానికి సాక్ష్యాలు కూడా లభించాయి. దీని పెరుగుదల రేటే నిపుణలను ఎక్కువగా కలవరపెడుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కోవిడ్‌ మహమ్మారి పని అయిపోలేదన్న నిర్ధారణకు వచ్చారు వారు. అందుకే ఈ కొత్త మ్యుటేషన్‌ను “వేరియంట్‌ అండర్‌ ఇన్వెస్టిగేషన్‌” వర్గంలో చేర్చారు.

ఏవై 4.2 వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తుంది..కానీ వ్యాధి తీవ్రతకు సంబంధించి నిర్దిష్టమైన ఆధారాలు అందుబాటులో లేవు. ఐతే దీనిపై టీకాలు బాగానే పనిచేస్తాయని అంటున్నారు. ఇది ఉపశమనం కలిగించే అంశం. ప్రస్తుతం బ్రిటన్‌లో ఏవై 4.2 కేసులు పెరుగుతున్నాయి. ఐనా ఆందోళన ఐతే ఇది భారీ స్థాయిలో ప్రభావం చూపించే అవకాశం లేదని, ప్రస్తుత వ్యాక్సిన్‌లను తట్టుకుని ఈ వైరస్‌ మనుగడ సాగించే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తుందా..రాదా…అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు. వచ్చినా సెకండ్‌ వేవ్‌ స్థాయి తీవ్రత ఉండకపొవచ్చు. దీనికి కారణం ఇప్పటికే చాలా మందికి కరోనా వచ్చి పోయింది. దాంతో దేశ జనాభాలో సగం మందికి పైగా కరోనాను తట్టుకునే శక్తి సమకూరే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పూర్తయ్యాయి. 70 శాతం వయోజనులు కనీసం ఒక్క డోసు టీకా అయినా తీసుకున్నారు. 30 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. 18 ఏళ్ల లోపు వారికి కూడా టీకా అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఒక వేళ థర్డ్‌ వేవ్‌ వచ్చినా మరీ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే థర్డ్‌ వేవ్‌ ప్రభావం 18 ఏళ్ల లోపు వయస్కులపై అధికంగా ఉండే అవకాశం ఉంది. తద్వారా అది పెద్దలకు సంక్రమించే ప్రమాదం ఉంది.

ఇక ప్రస్తుతానికి వస్తే దేశంలో కొత్త కేసులు 12 వేలకు తగ్గాయి. ఈ సంఖ్య ఇంచు మించు సెకండ్‌వేవ్‌ ప్రారంభం నాటిది. మరోపక్క కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. ఇప్పటి వరకు 102 కోట్ల 94 లక్షల పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఐతే ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 3 లక్షల 35 వేల 244 మంది వైరస్ బారిన పడ్డారు.

మరో వైపు, రష్యాలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సోమవారం 37,930 మంది వైరస్‌ బారినపడ్డారు. వెయ్యి మందికి పైగా మృత్యువాత పడ్డారు. రష్యాన్లది స్వయంకృతాపరాధమని చెప్పాలి. వ్యాక్సిన్‌ తీసుకోవటంలో అలసత్వం వారి కొంప ముంచింది.అందరి కన్నా ముందు వారికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ఐనా జనాభాలో మూడొంతుల మంది టీకా వేయించుకోలేదు. అనవసర భయాలు వారిని ప్రమాదంలోకి నెట్టాయి. మరోవైపు, డెల్టా వేరియంట్‌ ప్రభావంతో చైనాలో కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మే, జూలై, ఆగస్టు మాసాల్లో చైనాలో కేసులు పెరిగాయి. ఇప్పుడు మళ్లీ డెల్టా మళ్లీ చైనాను కలవరపెడుతోంది.

ఏదేమైనా కరోనా జాగ్రత్తలు పాటించటం మరవకూడదు. అనవసరంగా రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లటం మానేయటం మంచిది. తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి. వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. మన జాగ్రత్తల్లో మనం ఉంటేనే కారోనాను దూరం పెట్టగలం. మరో రెండు మూడు నెలలు అప్రమత్తంగా ఉంటే మహమ్మారిని జయించిన వాళ్లం అవుతాము!!
-Dr. Ramesh Babu Bhonagiri

Exit mobile version