దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఇటు ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరులో కరోనా కొత్త రకం వేవ్ కలవరం కలిగిస్తోంది. బెంగళూరులో ఓ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్ధులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. యూకేలో వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ AY.4.2 భారత్‌ను కూడా బెంబేలెత్తిస్తోంది. కర్ణాటకలో ఇప్పటివరకూ డెల్టా AY.4.2 కేసులు ఏడు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య శాఖ కమిషనర్ డి.రణ్‌దీప్ ప్రకటించారు.
ఓ రెసిడెన్షియల్ స్కూల్లో 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొడగు జిల్లా మడికెరిలోని రెసిడెన్షియల్ స్కూల్లో 22 మంది విద్యార్ధులు, 10 మంది బాలికలకు వైరస్ సోకింది. వీరంతా 9 నుంచి 12వ తరగతి చదువుతున్నవారే కావడం గమనార్హం. దీంతో అక్కడ వున్న మొత్తం విద్యార్ధినీ, విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాఠశాల మొత్తాన్ని శానిటైజ్ చేశామని ప్రిన్సిపల్ తెలిపారు. ఉన్నతాధికారులు పాఠశాలను సందర్శించి జాగ్రత్తలు సూచించారు.
దేశంలో ఇప్పటివరకూ 17 కొత్త రకం కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరు రాష్ట్రాల్లో ఈ కొత్త రకం కరోనా కేసులు నమోదు కావడంతో అంతా అప్రమత్తం అవుతున్నారు. అయితే, ఈ కరోనా వైరస్ వేరియంట్‌కి సంబంధించిన శాంపిల్స్ అన్నీ మే, సెప్టెంబర్‌లో సేకరించినవిగా వైద్య శాఖ అధికారులు గుర్తించారు. ఈ కొత్త రకం కరోనా కేసులు నమోదవుతుండటం భారత్‌లో కరోనా థర్డ్ వేవ్‌కు సంకేతంగా భావిస్తున్నారు. పండుగ సీజన్‌లో ఈ కొత్త వేరియంట్ కేసులు బయటపడటంపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కేసులు తగ్గుతున్నట్టే తగ్గి మళ్ళీ తమ ప్రభావం చూపుతున్నాయి.
ఈ వేవ్ కారణంగా భారత్‌లో ఇప్పటివరకూ ఎలాంటి మరణాలు నమోదు కాకపోయినప్పటికీ ఇతర వేరియంట్స్‌తో పోల్చుకుంటే వ్యాప్తి పట్ల అప్రమత్తత అవసరం అంటున్నారు వైద్యులు. అయితే, కరోనాను లైట్ తీసుకోవద్దని, వ్యాక్సిన్ తీసుకోవాలంటున్నారు డాక్టర్లు.
