మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ అంటే అభిమానులకు అంబరమంటే ఆనందం పంచేది. అందుకు కారణం – చిరంజీవిని మొదటి నుంచీ రాఘవేంద్రరావు తీర్చిదిద్దుతూ జనానికి దగ్గర చేశారు. వారిద్దరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా ‘మోసగాడు’. అందులో చిరంజీవి విలన్. అయినా ఆయనతో స్టెప్స్ వేయించి, శ్రీదేవి, జయమాలినితో కలసి చిందులేయించి డాన్సర్ గా ఓ గుర్తింపు సంపాదించి పెట్టారు రాఘవేంద్రరావు. అలాగే మహానటుడు యన్టీఆర్ తో చిరంజీవిని ‘తిరుగులేని మనిషి’లో నటింప చేయడమే కాదు, అందులో చిరంజీవితో సోలోగానూ ఓ పాట తెరకెక్కించారు. ఈ చిత్రాల ఫలితాలు ఎలా ఉన్నా, చిరంజీవికి నటునిగా మంచి గుర్తింపు లభించింది. ఇక చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘అడవిదొంగ’ కమర్షియల్ గా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత నుంచీ చిరంజీవి, రాఘవేంద్రరావు కలయికలో రూపొందిన పలు చిత్రాలు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. వాటిలో మరపురానిది ‘జగదేకవీరుడు- అతిలోకసుందరి’. ఆ చిత్రం తరువాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన సినిమా ‘రౌడీ అల్లుడు’. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో శ్రీసాయిరామ్ ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.వెంకటేశ్వరరావు, పంజా ప్రసాద్ నిర్మించారు. 1991 అక్టోబర్ 18న ‘రౌడీ అల్లుడు’ జనం ముందు నిలచింది. వారి మనసులు గెలిచింది.
చిరంజీవి ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. కథ మామూలుగానే ఉంటుంది. ఒకరి స్థానంలోకి మరొకరు వచ్చి ఆటపట్టించి, అసలు కథను రక్తి కట్టించడమే ఇందులోని ప్రధానాంశం. ఇలాంటివి అంతకు ముందు ‘దొంగమొగుడు’ లాంటి చిత్రాలలో చిరంజీవి చేసేశారు. అందువల్ల కథలో కొత్తదనం కనిపించక పోయినా, రాఘవేంద్రరావు మార్కుతో కథనం, పాటల చిత్రీకరణ జనాన్ని ఆకర్షించాయి. కథ విషయానికి వస్తే – కోటీశ్వరుడైన కళ్యాణ్ కుటుంబంలో ఆయన వెంటనే ఉంటూ గోతులు తీస్తారు. అతణ్ణి చంపాలనీ చూస్తారు. అందులో అతని అక్క భర్త చనిపోతాడు. తండ్రి కోమాలోకి వెళ్తాడు. ఈ నేపథ్యంలో తమ వ్యాపారాలు తానే చూసుకోవాలని భావిస్తాడు కళ్యాణ్. ముంబై వెళ్ళాలనుకుంటాడు. కళ్యాణ్ కంటే ముందు ప్రత్యర్థులు వెంకట్రాముడు, అతని మిత్రుడు ముంబై వెళతారు. అక్కడ అచ్చు కళ్యాణ్ పోలికలతో ఉన్న ఆటో జానీని చూసి, కళ్యాణ్ ను సఫా చేసి, అతని స్థానంలో ఇతణ్ణి పెట్టే ప్రయత్నం చేస్తారు. కళ్యాణ్ కంపెనీలోనే పనిచేసే నమ్మకస్థుడైన మాధవయ్య అనే ఉద్యోగి ఒకరుంటారు. ఆయన కూతురు కళ్యాణ్ ప్రేయసి. మాధవయ్య, ఆటో జానీ, అసలైన కళ్యాణ్ కాదని గుర్తిస్తాడు. మాధవయ్యను ఓ ప్లాన్ ప్రకారం చంపేసి, ఆ నేరం కళ్యాణ్ పై మోపుతారు. వెంకట్రాముని అసలు విషయం తెలిశాక, జానీ కూడా పశ్చాత్తాపం చెందుతాడు. ఎలాగైనా కళ్యాణ్ కుటుంబాన్ని వారి బారి నుండి రక్షించాలని నిర్ణయించుకుంటాడు. వెంకట్రాముడు కూతురు జానీని, ప్రేమిస్తుంది. చివరకు జానీ, అసలు దోషుల భరతం పట్టి కళ్యాణ్ ను రక్షించడంతో కథ సుఖాంతమవుతుంది.
చిరంజీవి సరసన శోభన, దివ్యభారతి నాయికలుగా నటించారు. కోట శ్రీనివాసరావు, అల్లు రామలింగయ్య, కెప్టెన్ రాజు, బ్రహ్మానందం, సత్యనారాయణ, జె.వి.సోమయాజులు, అన్నపూర్ణ, సుధ ఇతర పాత్రల్లో కనిపించారు. డిస్కో శాంతి “అమలాపురం బుల్లోడా…” పాటలో నర్తించారు. ఈ చిత్రానికి బప్పిలహిరి సంగీతం సమకూర్చారు. అంతకు ముందు చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రానికి కూడా బప్పిలహిరి మ్యూజిక్ భలేగా సందడి చేసింది. దాంతో ఈ సినిమాకూ ఆయనే స్వరకల్పన చేశారు. సిరివెన్నెల, భువనచంద్ర పాటలు రాశారు. “చిలుకా క్షేమమా…”, “కోరి కోరి కాలుతుంది…”, “లవ్ మీ మై హీరో…”, “ప్రేమా గీమా తస్సాదియ్యా…”, “స్లోలీ స్లోలీ…”, “తద్దినకా… తప్పదికా…” పాటలు ఆకట్టుకున్నాయి.
‘రౌడీ అల్లుడు’ సినిమాకు ముందు వచ్చిన చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలవడంతో, ఐదు నెలల తరువాత వచ్చిన ఈ సినిమాకు కూడా ఎంతో క్రేజ్ లభించింది. అదీగాక, అంతకు ముందు సంవత్సరం రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి జంటగా రూపొందిన ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ సైతం ఎంతగానో అలరించింది. దాంతో ‘రౌడీ అల్లుడు’ ఎలా ఉన్నా అభిమానులు మెచ్చేశారు. భలేగా చూసేశారు. అనేక కేంద్రాలలో ‘రౌడీ అల్లుడు’ శతదినోత్సవం చూసింది. నిర్మాతలకు మంచి లాభాలు చూపింది. ఈ చిత్రాన్ని తమిళంలో ‘పోక్కిరి మాప్పిలై’గా డబ్ చేశారు. ఈ సినిమా తరువాత విడుదలైన చిరంజీవి చిత్రం ‘ఘరానా మొగుడు’. ఈ చిత్రానికీ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం, ఆ సినిమా కూడా బంపర్ హిట్ కావడం విశేషం!