Site icon NTV Telugu

పెరుగుతున్న కరోనా కేసులు.. చైనాలో మళ్లీ లాక్‌డౌన్

కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కొన్నిరోజులుగా అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. చైనా వ్యాప్తంగా సోమవారం 29 కరోనా కేసులు నిర్ధారణ కాగా.. అందులో ఆరు కేసులు చైనా వాయువ్య ప్రావిన్సు గాన్సు రాజధాని లాన్‌జౌలో నమోదయ్యాయి. దీంతో 40 లక్షల జనాభా గల లాన్‌జౌ నగరంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు అత్యవసరం అని భావిస్తే మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించింది.

Read Also: హెల్మెట్లతో వైద్యులు.. రక్షణ కోసమేనా..?

అంతేకాకుండా కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో సెలవులు ప్రకటించడం, ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాలను రద్దు చేయడం వంటి చర్యలకు కూడా చైనా ప్రభుత్వం ఉపక్రమించింది. ఇతర దేశాలతో పోల్చి చూస్తే చైనాలో తక్కువ కేసులే నమోదవుతున్నా గత కొన్నాళ్లుగా చూస్తే మాత్రం ఈ సంఖ్య ఎక్కువే అని చెప్పాలి. చైనాలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య లక్ష దాటలేదంటే అక్కడి ప్రభుత్వం చర్యలు ఏ స్థాయిలో చేపట్టిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఉత్తర చైనాలోని గాన్సు, ఇన్నర్ మంగోలియా, గుయిజౌ, బీజింగ్‌లలో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు మూసివేశారు. రాజధాని బీజింగ్‌లో అధికారులు క‌ఠిన‌ నిబంధనలను అమ‌లు చేస్తున్నారు.

Exit mobile version