NTV Telugu Site icon

ఈ చూయింగ్ గమ్‌తో కరోనా వ్యాప్తికి చెక్

చాలామందికి చూయింగ్ గమ్ తినే అలవాటు వుంటుంది. యూత్‌లో ఇది మరీ ఎక్కువ. దీంతో కరోనా వ్యాప్తికి చెక్ పెట్టవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో పరిశోధకులు ఆశాజనక ఫలితాలు సాధించారు. ఇటీవల ప్రచురితం అయిన అధ్యయన ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడిచేస్తున్నాయి. కరోనా సోకినా వ్యక్తుల లాలాజలంలో అధిక స్థాయిలో వైరస్ ఉంటుందని అధ్యయనాల ఆధారాలు చెబుతున్నాయి. అందువల్ల యూఎస్ పరిశోధకులు ప్రత్యేకంగా ఒక చూయింగ్ గమ్ రూపొందించారు. దీని సహాయంతో నోటిలోని వైరస్ మొత్తాన్ని తగ్గించవచ్చు. దాని వ్యాప్తిని అరికట్టవచ్చంటున్నారు.

నోటి ఆరోగ్యాన్ని కాపాడడంతో, నోటికి వ్యాయామం అందించడంలో చూయింగ్ గమ్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా సంఖ్యను చూయింగ్ గమ్ నమలడం ద్వారా తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. చూయింగ్ గమ్‌లోని ACE2 ప్రొటీన్లు నోటిలోని వైరస్ కణాలను ఆపగలవు. అవి మన కణాలకు సోకే అవకాశాన్ని తగ్గించగవని నిరూపణ అయింది. మొక్కలలో ఉత్పత్తి అయిన అధిక స్థాయి ACE2 ప్రోటీన్‌లను కలిగి ఉన్న గమ్‌ను పరిశోధకులు తయారు చేశారు. ఇది ప్రారంభ-దశ పరిశోధన కావడంతో ఫలితాలను నిర్దారించలేకపోతున్నారు. చూయింగ్ గమ్ నమలడం అనేది ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా వుంటుంది.

తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వంటి వివిధ కోవిడ్ వేరియంట్‌లలో గమ్ ప్రభావవంతంగా పనిచేస్తుందా? లేదా అనేది తేలాల్చి వుంది. ప్రపంచ ట్రయల్స్‌లో ఉత్పత్తిని పరీక్షించే వరకు దీనిపై ఒక నిర్ణయానికి రాలేం.సార్స్-కోవి-2 లాలాజల గ్రంధుల్లో వుంటుంది. ఇది సోకిన ఎవరైనా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేదా మాట్లాడినప్పుడు ఆ వైరస్ ఇతరులకు చేరుకోవచ్చంటున్నారు అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో హెన్రీ డానియెల్. ఈ చూయింగ్ గమ్‌ పై మరింతగా పరిశోధనలు సాగాల్సి వుంది.