NTV Telugu Site icon

చిన్నారిపై అత్యాచారం.. హత్య కేసు నిందితుడు ఆత్మహత్య

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసు నిందితుడు పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాజు హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాప చైత్రపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే ట్రాక్ విఘత జీవిగా కనిపించాడు. చేతిపై మౌనిక అని రాసివున్న పచ్చబొట్టు ఆధారంగా అతడిని రాజుగా గుర్తించినట్టు తెలుస్తోంది.

వరంగ‌ల్ జిల్లాలోని న‌ష్‌క‌ల్‌ రైల్వేట్రాక్‌పై రాజు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు బావిస్తున్నారు. వేగంగా వ‌స్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి రాజు సూసైడ్ చేసుకున్నట్టు కో పైల‌ట్ పోలీసుల‌కు చెప్పినట్టు సమాచారం. ఘటనాస్థలికి పోలీసులు వెళ్లి పరిశీలిస్తున్నారు. రాజుది ఆత్మహత్యా ..హత్యా అన్నది అధికారికంగా ప్రకటించాల్సి వుంది. అయితే రాజు మృతదేహం ఫొటోను అతని కుటుంబ సభ్యులకు పోలీసులు చూపించారు. వారు కూడా ఫొటోలో ఉన్నది రాజుగా గుర్తించారు. స్థానిక పోలీసులు ద్వారా హైదరాబాద్‌ పోలీసులకు రాజు ఆత్మహత్య సమాచారం అందింది.

నిందితుడు రాజు చివరిసారి హైదరాబాద్‌ ఉప్పల్‌ ప్రాంతంలో కనిపించాడు. తర్వాత ఇక ఎక్కడా కనపించలేదు. అతడి ఆచూకీ కోసం పోలీసులు చేయని ప్రయత్నాల్లేవు. వివరాలు తెలిపినవారికి 10 లక్షల బహుమతి కూడా ప్రకటించారు. రాజును పట్టుకునేందుకు పోలీసులు వేర్వేరు బృందాలుగా ముమ్మర గాలింపు జరిపారు. ఈ క్రమంలోనే రాజు మృతదేహం దొరికింది.

నల్గొండ నుండి కూలి పనుల కోసం నగరానికి వచ్చిన కుటుంబం లోని ఆరేళ్ళ పాప పై, ఆ పాప ఇంటికి పక్కనే ఉండే రాజు అత్యాచారం చేసి, చంపేసి, పరార్ అయ్యాడు. పాప కనిపించక పోయేసరికి కంగారు పడి అన్ని చోట్ల వెతికిన తల్లిదండ్రులు చివరికి అదే వీధిలో జులాయిగా తిరుగుతున్న రాజు పై అనుమానం వచ్చింది. అతని ఇల్లు తాళం వేసివుండటంతో దాన్ని పగలగొట్టి చూడగా .. అక్కడ చిన్నారి పాప విగత జీవిగా పడి కనిపించింది.

సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియా ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తరువాత ప్రధాన మీడియా ప్రముఖంగా కవర్‌ చేయటంతో పోలీసులపై వొత్తిడి పెరిగింది. రాజు ఆత్మహత్యతో ఈ కేసుకు ముగింపు పలికినట్టయింది. అయితే రాజు పరారైనప్పటి నుంచి ఎక్కడ ఉన్నాడు…ఎక్కడెక్కడ షెల్టర్‌ తీసుకున్నాడో తెలియాల్సివుంది.

మరోవైపు రాజుది ఆత్మహత్య కాదని..హత్యేనని రాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. నిందితుడు రాజు భార్య ఊరు సూర్యాపేట జిల్లా జలాల్‌పురం.ఏడాది క్రితం ప్రసవం కోసం పుట్టింటికి వచ్చి అక్కడే ఉంటోంది. అతను అప్పుడప్పుడు వచ్చేవాడని, రెండు వారాల క్రితం జలాల్‌పురానికి వచ్చి కూలి పనులు చేశాడని సంబంధీకులు, స్థానికులు తెలిపారు. ఒకరోజు తాగిన మైకంలో అత్తను కొట్టాడని, కుటుంబ సభ్యులు తిరిగి దాడి చేస్తారని భయంతో హైదరాబాద్‌కు పారిపోయినట్టు తెలుస్తోంది.