NTV Telugu Site icon

అన్నవరం సత్యదేవుని ఆలయానికి మహర్దశ

కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం. అన్నవరంలో వెలపిన సత్యదేవుడిని దర్శించుకోవడంతో ఎంతో అనుభూతి పొందుతారు భక్తులు. కేంద్ర ప్రభుత్వం ప్రేవేశ పెట్టిన ప్రసాద్ పథకంలో ఈసారి అన్నవరం దేవస్థానానికి చోటు దక్కింది. సుమారు 50 కోట్ల రూపాయల నిధులు సత్యదేవుని కొండ అభివృద్ధికి కేటాయించడం జరిగింది. ఇప్పటికే అన్నవరం దేవస్థానం ప్రసాద్ పథకం ద్వారా భక్తుల సౌకర్యాల నిమిత్తం చేపట్టే అభివృద్ధి పనులకు రూపకల్పన చేశారు.

అందులో భాగంగా టూరిజం శాఖ ఈడీ మాల్ రెడ్డి నేతృత్వంలో ఎంపీ వంగా గీత. స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, ఆలయ ఛైర్మన్ రోహిత్ ఈఓ త్రినాథ్‌, ఇతర శాఖల సిబ్బందితో కొండపై ఈఓ ఛాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రత్నగిరి కొండకు పర్వదినాల్లో వచ్చే భక్తులకు దేవస్థానం ఏర్పాటు చేసే సౌకర్యాలు సరిపోవడం లేదు. దీంతో వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వాటిలో ముఖ్యంగా వసతి గదుల క్యూ లైన్లు, వ్రత మండపాలు , అన్నదానం, కొండపై ట్రాఫిక్ అంతరాయం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకునే దేవస్థానం చైర్మన్ ఈఓ త్రినాథ్‌ రత్నగిరిపై ప్రసాద్ పథకం ద్వారా ఈ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు.

రూ50 కోట్లతో చేపట్టే అభివృద్ది పనులతో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కలగాలని ఎంపీ వంగా గీత ఆకాంక్షించారు. అన్నవరం సత్యదేవుని ఆలయం కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకంలో చోటు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కేంద్రం కేటాయించే నిధులతో భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించే విధంగా పనులు చేపడతామని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ అన్నారు. కేంద్ర నిర్ణయం పట్ల భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.