Site icon NTV Telugu

మార్కెట్‌లోకి బఫర్ స్టాక్.. తగ్గిన ఉల్లి ధరలు

గత నెలలో ఉల్లిపాయల ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు తగ్గుముఖం పట్టినా కిలో రూ.40కి పైగానే పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారీ వర్షాల కారణంగా అక్టోబర్ మొదటి వారం నుంచి ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయని.. దీంతో తాము బఫర్ నిల్వల నుంచి ఉల్లిని సరఫరా చేస్తుండటంతో ధరలు దిగి వస్తున్నాయని కేంద్రం తెలిపింది. బఫర్ స్టాక్ నుంచి ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, పాట్నా, గౌహతి, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, చండీగఢ్, కొచ్చి, రాయ్‌పూర్ వంటి ప్రధాన మార్కెట్లకు ఇప్పటివరకు 1.11 లక్షల టన్నుల ఉల్లిపాయలను విడుదల చేయడంతో కిలోకు రూ.5 నుంచి రూ.12 వరకు తగ్గాయని చెప్పింది.

Read Also: గుడ్‌న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉల్లి ధరలు చౌకగా ఉన్నాయని, గతంలో తాము తీసుకున్న చర్యలే దీనికి కారణమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఆలిండియా రిటైల్, హెల్‌సేల్ మార్కెట్లలో ప్రస్తుతం కిలో ఉల్లిగడ్డల ధర రూ.40.13గా ఉందని, క్వింటాల్‌ ధర రూ.3,215గా ఉందని పేర్కొంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ రాష్ట్రాలకు రూ.21కే కిలో ఇవ్వడానికి సిద్ధమైందని, రిటైల్‌ మార్కెట్‌ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు రవాణా ఖర్చులతో కలిపితే వచ్చే వాస్తవ ధరకు ఉల్లి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంది. ధరల స్థిరీకరణ నిధితో వినియోగ వ్యవహారాల శాఖ బఫర్‌ నిల్వలు నిర్వహిస్తోందని కేంద్రం పేర్కొంది.

Exit mobile version