NTV Telugu Site icon

ఇద్దరు కార్పోరేటర్లపై బీజేపీ వేటు.. కారణం అదే?

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పోరేషన్ మేయర్ ఎన్నికలు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ మేయర్ ఎన్నికలు బీజేపీలో చిచ్చురేపాయి. కాకినాడలో ఇద్దరు బీజేపీ మహిళా కార్పోరేటర్ల సస్పెన్షన్ వేటు వేసింది. నూతన మేయర్ ఎన్నికలో వైసీపీకి మద్దతు తెలిపిన 5వ వార్డు కార్పొరేటర్ సుజాత, 41వ వార్డు కార్పొరేటర్ సత్యవతి. విప్ ధిక్కరించడంతో ఇద్దరినీ సస్పెండ్ చేసింది బీజేపీ.

తాము జారీచేసిన విప్ ధిక్కరించడంతో ఇద్దరిని సస్పెండ్ చేశారు బీజేపీ క్రమశిక్షణా కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు పాకా సత్యనారాయణ. క్రమశిక్షణకు మారు పేరైన బీజేపీలో పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే ఏస్థాయిలో ఉన్నవారినైన ఉపేక్షించేది లేదని పార్టీ స్పష్టం చేసిందని వారిపైనా చర్యలు తప్పవన్నారు కాకినాడ పార్లమెంట్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్.

Read Also:కాకినాడ మేయర్‌గా శివప్రసన్న, డిప్యూటీగా ఉదయ్‌ కుమార్

టీడీపీ కైవసం చేసుకున్న కాకినాడ కార్పోరేషన్లో అసమ్మతి పరిణామాల నేపధ్యంలో మేయర్ సుంకర పావని పదవీచ్యుతురాలయిన సంగతి తెలిసిందే. సుంకర పావనిని మేయర్‌ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వంగెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. జీవోఎంఎస్‌ నెంబర్‌ 129 ద్వారా ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌ 1955లోని సెక్షన్‌ 91/ఎ(6) ద్వారా ఉత్తర్వులిచ్చారు.

ఆమెతోపాటు డిప్యూటీ మేయర్‌ కాలా సత్తిబాబును కూడా పదవి నుంచి తొలగించారు. అనంతరం కొత్త మేయర్‌, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్పోరేషన్ కూడా వైసీపీ వశం అయింది. కాకినాడ మేయర్‌గా సుంకర శివప్రసన్న, డిప్యూటీ మేయర్‌గా మీసాల ఉదయకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్‌ ఎన్నికకు టీడీపీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. బీజేపీ కార్పోరేటర్లు ఇద్దరు విప్ ఉల్లంఘించారు. దీంతో కఠినచర్యలకు ఉపక్రమించింది బీజేపీ.