దేశంలో ఈ ఏడాది కాలంలో పెట్రోల్ ధరలు రూ.20 మేర పెరిగాయి. దీంతో సామాన్యులు అవస్థలు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ తోపాటుగా వంటగ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.200 వరకు గ్యాస్ ధరలు పెరిగాయి. అయితే, దేశంలో పెట్రోల్ ధరలు పెరగడానికి కారణం ఆఫ్ఘనిస్తాన్‌లో అంతర్యుద్ధమే అని, తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను అక్రమించుకోవడంతో ధరలు పెరిగాయని చెప్పుకొచ్చారు కర్ణాటక ఎమ్మెల్యే. హుబ్లీ -ధార్వాడ్ పశ్చిమ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ పెట్రోల్ ధరల పెరుగుదలపై ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు గత నెల 15 వ తేదీన ఆక్రమించుకున్నారు. 15 రోజుల క్రితమే ఆఫ్ఘన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లింది. అంతేకాదు, మనదేశం చమురును సౌదీ అరెబియా, యూఏఈ, నైజీరియా, అమెరికా, కెనడా దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా మనదేశం చమురును దిగుమతి చేసుకుంటున్నా అది స్వల్పమే. ఆఫ్ఘన్ ప్రభావం ఇండియా చమురుపై పెద్దగా ప్రభావం చూపించదని నిపుణులు చెబుతున్నారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏడాది కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. ఆ పెరుగుదలకు, తాలిబన్ల ఆక్రమణకు లింకేంటో ఎమ్మెల్యేకే తెలియాలి.
పెట్రోల్ ధరలకు… తాలిబన్లకు లింకు పెట్టిన ఎమ్మెల్యే…
