భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. ఈ దేశంలోని పౌరులందరినీ ఒక్కటిగా కలిపి ఉంచాలని మహనీయులు కలలు కని రూపొందించిన రాజ్యాంగం మనది. కానీ ఏడు దశాబ్దాలు గడిచినా ఈ దేశంలో కులాల మధ్య చిచ్చు రావణకాష్టంలా రగులుతూనే ఉంది. దీనికి కారణం ఏమిటి? రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయని రాజకీయ నాయకులదా? కులోన్మాదాన్ని పెంచి పోషిస్తూ పబ్బం గడుపుకుంటున్న కుల సంఘాల నేతలదా? అటు అధికారపీఠంపై ఉన్న నేతలలోనూ, ఇటు కులోన్మాదులలోనూ మార్పు రాకపోతే… అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి అర్థమే లేనట్టు. ఇదే అంశాన్ని తెలియచెప్పిన చిత్రం అర్థ శతాబ్దం
. ఈ శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను రవీంద్ర పుల్లె డైరెక్ట్ చేశారు.
కథ విషయానివస్తే… రామన్న (సాయికుమార్) మాజీ నక్సలైట్. ఆ ఉద్యమంలోనూ కులతత్త్వం ఉండటం చూసి, దానిని వదిలేసి సాధారణ జీవితాన్ని గడపడానికి సొంతూరు సిరిసిల్లకు వచ్చేస్తాడు. గ్రామంలో పురి విప్పిన కులోన్మాదాన్ని తుంచాలని చూస్తాడు. కానీ అతని వల్ల కాదు. అగ్రవర్ణానికి చెందిన రామన్న కూతురు పుష్ప (కృష్ణవేణి)ను అదే ఊరిలోని వెనకబడిన కులానికి చెందిన కృష్ణ (కార్తీక్ రత్నం) ప్రేమిస్తాడు. ఓ పువ్వు విషయంలో జరిగిన పొరపాటుతో గ్రామంలోని పాత రాజకీయ కక్షలు, కులతత్త్వం ఒక్కసారిగా బయట పడతాయి. ఆ మారణ హోమం మాటున వ్యక్తిగత కక్షలను తీర్చుకునే ప్రయత్నం మరికొందరు చేస్తారు. దాంతో ఊరు వల్లకాడుగా మారిపోతుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎలాంటి విపరీతాలకు దారితీస్తాయి? కులతత్త్వం మనిషిని ఎలా పిచ్చివాడిని చేస్తుంది? చేతిలో అధికారం ఉండి కూడా అధికారులు ఎలా నిస్సహాయులుగా మారిపోతారు? అనేవి ఈ సినిమాలో చూడొచ్చు.
గ్రామాలలోని కులతత్త్వాన్ని, రాజకీయ క్రీడను ఎలివేట్ చేసే క్రమంలో దర్శకుడు రవీంద్ర ఓ ప్రేమకథను ఆసరాగా చేసుకున్నాడు. కథలోని ప్రధాన పాత్రలను కాస్తంత లోతుగా పరిశీలిస్తే వారిలో వైరుధ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. కులతత్త్వానికి వ్యతిరేకంగా నక్సల్ ఉద్యమం నుండి బయటకు వచ్చేసిన రామన్న తన కూతురు విషయానికి వచ్చే సరికీ తడబడటం కరెక్ట్ కాదనిపిస్తుంది. అతని క్యారెక్టర్ గ్రాఫ్ ను ఠక్కున దించేసినట్టు అయ్యింది. అలానే ప్రథమార్ధంలోని చాలా సన్నివేశాలు పేలవంగా సాగాయి. మరీ ముఖ్యంగా హీరోహీరోయిన్ల ప్రేమ వ్యవహారం అనవసరంగా సాగదీశారు. ఇక ఇన్ స్పెక్టర్ రంజిత్ ఇంట్రడక్షన్ సీన్ అర్థం లేనిది. అతని క్యారెక్టరైజేషన్ కు ఏ మాత్రం పొసగనిది. హీరోహీరోయిన్లు కార్తీక్ రత్నం, కృష్ణవేణి చక్కగా ఆయా పాత్రల్లో ఇమిడిపోయారు. సాయికుమార్, రాజా రవీంద్ర, రామరాజు, నవీన్ చంద్ర, శుభలేఖ సుధాకర్, అజయ్, ఆమని, పవిత్రా లోకేష్, శరణ్య ప్రదీప్, టి.ఎన్.ఆర్, సుహాస్… ఇలా చాలా మంది పేరున్న నటీనటులే ఇందులో నటించారు. కానీ వాళ్ళను సక్రమంగా దర్శకుడు ఊపయోగించుకోలేకపోయాడు. కేవలం ఐదారు పాత్రలపైనే దృష్టిపెట్టాడు. నిజానికి సన్నివేశాలు బలహీనంగా ఉండటంతో నటీనటులు ఎంత గొప్పగా నటించాలని చూసినా అవి ఎలివేట్ కాలేదు. ఎంచుకున్న కథాంశంలోని గొప్పతనం మనకు తెర మీద పూర్తి స్థాయిలో కనిపించదు.
నవాఫల్ రాజా అసీ సంగీతం చాలా వరకూ సినిమాను నిలబెట్టింది. సినిమాటోగ్రాఫర్స్ ఇ.జె.వేణు, వెంకట్ శాఖమూరి, అస్కర్ పనితనం కూడా మెచ్చుకోదగ్గది. పల్లె అందాలను చక్కగా తెరకెక్కించారు. అదే సమయంలో యాక్షన్ సీన్స్ ను ఉత్కంఠభరితంగా చూపించారు. ఆ సన్నివేశాల ఎడిటింగ్ కూడా బాగుంది. సిద్ శ్రీరామ్ పాడిన ఏ కనులు చూడని...
పాట మూవీకి హైలైట్. మిగిలిన పాటల సాహిత్యం అర్థవంతంగా ఉన్నా, సినిమా నిడివిని పెంచడానికి వాటిని వాడుకున్నట్టుగా ఉంది. నిజం చెప్పాలంటే కథాగమనానికి అవి అడ్డు పడ్డాయి. ప్రథమార్థం నిదానంగా సాగి వీక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. దానితో పోల్చితే ద్వితీయార్థం బాగుంది. కథలోని ప్రధాన పాత్రలను పతాక సన్నివేశాల్లో ఒక దగ్గరకు తీసుకురావడంతో పాటు వీక్షకుల ఊహకు అందని విధంగా ముగింపును దర్శకుడు ఇచ్చాడు.
భారత రాజ్యంగం అమలులోకి వచ్చిన యాభై ఏళ్ళకు జరిగిన కథగా దీనిని దర్శకుడు తీశాడు. నిజంగానే 2000 ప్రాంతంలో ఈ సినిమా విడుదలై ఉంటే బాగానే ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవా? మారిపోయాయా? అంటే లేదనే చెప్పాలి. కానీ ఇదే తరహా కథాంశాలతో ఇప్పటికే అనేక చిత్రాలు వచ్చినందువల్ల కొత్త అనుభూతిని అర్థ శతాబ్దం
మనకు అందించదు. ఎంచుకున్నది అర్థవంతమైన, ఆలోచన రేకెత్తించే కథే అయినా… కథనం పేలవంగా ఉంటడం ప్రధానమైన లోపం. అయితే దర్శకుడు రవీంద్రలోని సిన్సియారిటీని గుర్తించి ఈ సినిమాను నిర్మించిన కిరణ్, రాధాకృష్ణ లను అభినందించాలి.
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
మ్యూజిక్, సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు
మైనెస్ పాయింట్
ఆకట్టుకోని కథనం
సహనానికి పరీక్ష పెట్టే ప్రథమార్ధం
క్యారెక్టరైజేషన్స్ లో తడబాటు
రేటింగ్ : 2.25 / 5
ట్యాగ్ లైన్: అర్థ శతాబ్దం
… మారని పథం!