NTV Telugu Site icon

పర్యాటక రంగానికి ఊతం.. రాష్ట్రానికి రానున్న కీలక ప్రాజెక్టులు..!

పర్యాటక రంగం అభివృద్ధిపై ఫోకస్‌ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది.. రాష్ట్రంలో భారీ టూరిజం ప్రాజెక్టుల పై బోర్డులో చర్చించారు.. ఏపీలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే దిశగా రానున్న పలు కీలక ప్రాజెక్టులపై చర్చ జరగగా.. ఒక్కో ప్రాజెక్టు పై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు.. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానుండగా.. వీటి ద్వారా దాదాపు 48 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని అధికారులు చెబుతున్నమాట.. ఇక, ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 1,564 హోటల్ గదులు అందుబాటులోకి రానుండగా.. ఐదేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు..

Read Also: ఆశయంతో వస్తున్నా.. అందరి సహకారం కావాలి..!

విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీ హిల్స్, పిచ్చుక లంకలో రిసార్టులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.. ప్రముఖ సంస్థ ఒబెరాయ్ ఆధ్వర్యంలో ఈ రిసార్టులు రాబోతున్నాయి.. ఒబెరాయ్ విలాస్‌ బ్రాండ్‌తో రిసార్టులు, విశాఖపట్నం శిల్పా రామంలో హయత్‌ ఆధ్వర్యంలో స్టార్‌ హోటల్, కన్వెన్షన్‌ సెంటర్‌, తాజ్‌ వరుణ్‌ బీచ్‌ పేరుతో విశాఖలో మరో హోటల్, సర్వీసు అపార్ట్‌మెంట్‌, విశాఖపట్నంలో టన్నెల్‌ ఆక్వేరియం, విశాఖలో స్కై టవర్ నిర్మాణం, విజయవాడలో హయత్‌ ప్యాలెస్‌ హోటల్‌ ఇలా ఏర్పాటు కాబోతున్నాయి.. ఇక, అనంతపురం జిల్లా పెనుగొండలో జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.. ఇస్కాన్‌ ఛారిటీస్‌ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రాబోతోంది. ఈ ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఇక, ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ మాట్లాడుతూ.. పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని ఆకాంక్షించారు.. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు ఉండాలి.. అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలని.. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. ఆధునిక వసతులు అందుబాటులోకి రావడంతో టూరిజం పరంగా రాష్ట్ర స్ధాయి పెరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఏపీ సీఎం.. పెద్ద సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తారన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై ఆధారపడేవారికి మెరుగైన అవకాశాలు వస్తాయని.. విశాఖపట్నంలో లండన్‌ ఐ తరహా ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.