NTV Telugu Site icon

గోల్డెన్‌ గర్ల్‌ అవనికి ఆనంద్‌ మహీంద్రా బంపరాఫర్

టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే ఏడు పతకాలను తన ఖాతాలో వేసుకుంది భారత్.. ఇక, షూటింగ్‌లో స్వర్ణం సాధించి సత్తా చాటింది భారత మహిళా షూటర్‌ అవని లేఖరా.. దీంతో.. ఆమెకు బంపరాఫర్‌ ఇచ్చారు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్‌ మహీంద్రా.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన.. పలు అంశాలపై స్పందిస్తూ ఉంటారు.. ఇక, కొన్ని సార్లు గిఫ్ట్‌లు ఇస్తూ సర్‌ప్రైజ్ చేస్తుంటారు.. ఇప్పుడు గోల్డెన్‌ గర్ల్‌ అవని లేఖరాకు ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నవారికి తయారు చేయనున్న తమ తొలి ఎస్‌యూవీని బహూకరించనున్నట్టు ప్రకటించారు. భారత్‌కు గోల్డ్‌ మెడల్‌ అందించిన అవనిని ప్రత్యేకంగా అభినందించిన మహీంద్రా.. తన ప్రకటనతో ఆమెకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

మరోవైపు.. తన లాంటి ప్రత్యేక సామర్థ్యం ఉన్న వారికోసం భారతదేశంలో ప్రత్యేక ఎస్‌యూవీలను తయారు చేయమని భారత ఆటోమొబైల్ పరిశ్రమను అభ్యర్థించారు భారత పారాలింపిక్స్‌ కమిటీ అధ్యక్షులు దీపా మాలిక్. తనకు ఎస్‌యూవీ నడపడం అంటే చాలా ఇష్టమనీ, ఇలాంటి కార్లలో ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేయాలని మహీంద్రా, టాటా మోటార్స్, ఎంజీ ఇండియా లాంటి భారతీయ ఆటోమొబైల్ దిగ్గజాలను కోరారు. ఎవరైనా ప్రత్యేక సీట్‌లతో కూడిన ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకువస్తే, తప్పనిసరిగా కొనుగోలు చేస్తానని పేర్కొంటూ.. సోషల్‌ మీడియా వేదికగా వీడియో షేర్‌ చేశారు దీపా మాలిక్‌.. ఇప్పుడా ట్వీట్‌పై స్పందించిన మహీంద్ర.. ఈ సవాలును స్వీకరిస్తున్నాని.. వారికోసం ఎస్‌యూవీలను తయారీపై దృష్టి పెట్టాలని తన ఉద్యోగి వేలును కోరినట్టు తెలిపారు.. ఆ ట్వీట్‌లోలోనే.. తమ తొలి ఎస్‌యూవీని గోల్డెన్‌ గర్ల్‌ అవని లేఖరాకు గిఫ్ట్‌గా ఇవ్వాలనికుంటున్నానని పేర్కొన్నారు.