(సెప్టెంబర్ 12న అక్కినేని అమల పుట్టినరోజు)
అక్కినేని వారింటి కోడలుగా అడుగు పెట్టిన దగ్గర నుంచీ అమల వ్యక్తిగానూ తాను ఎంత శక్తిమంతమో నిరూపించుకున్నారు. భర్త నాగార్జున ఓ వైపు హీరోగా, మరో వైపు నిర్మాతగా, ఇంకో వైపు స్టూడియో అధినేతగా, ఇవి కాక ఎంటర్ టైన్ మెంట్ మీడియా భాగస్వామిగా, హోస్ట్ గా, ఆంట్రప్రెన్యూర్ గా సాగుతూ ఉండగా, అర్ధాంగిగా ఆయనకు అన్ని విధాలా నైతికబలాన్ని అందిస్తున్నారు అమల. నవతరం కథానాయకుడుగా తనయుడు అఖిల్ ను తీర్చిదిద్దే ప్రయత్నంలోనూ ఉన్నారామె. జంతు సంరక్షణ కోసం ‘బ్లూ క్రాస్ సంస్థ’ను ఏర్పాటు చేసి, తద్వారా జంతువులను తాను ఎంతగా ప్రేమిస్తున్నానో నిరూపించారు అమల. ఇలా ప్రస్తుతం సాగుతున్న అమల ఒకప్పుడు అందాలతారగా జేజేలు అందుకున్నారు. ముఖ్యంగా నాగార్జున హిట్ పెయిర్ గా ఆమె అలరించారు. ఆ వైనాన్నీ అభిమానులు ఈ నాటికీ గుర్తు చేసుకొని మురిసిపోతున్నారు.
బెంగాల్ లో జన్మించిన అమల చెన్నైలోని ‘కళాక్షేత్ర’లో చేరి భరతనాట్యంలో బి.ఎఫ్.ఏ. చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె నాట్యం చూసిన ప్రముఖ నటుడు, దర్శకుడు టి.రాజేందర్, అమలను నటింప చేయాలని ఆశించారు. అమల తల్లిని అంగీకరింపచేసి, తన ‘మైథిలీ ఎన్నై కాదలి’ చిత్రం ద్వారా తెరకు పరిచయం చేశారు. ఆ సినిమా ఘనవిజయంతో అమలకు ఎంతో పేరు లభించింది. సినిమాల్లో నటించే అవకాశాలూ వెల్లువెత్తాయి. తెలుగులో నాగార్జున నటించిన ‘కిరాయిదాదా’ చిత్రంతో జనం మదిని దోచేశారు అమల. ఆ తరువాత “రక్తతిలకం, రాజా విక్రమార్క, అగ్గిరాముడు, ఆగ్రహం” వంటి చిత్రాలలో నటించారు. నాగార్జునతో కలసి అమల “చినబాబు, శివ, నిర్ణయం, ప్రేమయుద్ధం” వంటి చిత్రాలలో అలరించారు. నాగార్జున కెరీర్ ను పెద్ద మలుపు తిప్పిన ‘శివ’ తెలుగు, హిందీ రెండు వర్షన్స్ లోనూ అమల నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో అమల నటించిన అనేక చిత్రాలు జయకేతనం ఎగురవేశాయి. ఆమె నటించిన తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదమై అలరించాయి.
తెరపై నాగార్జునకు విజయనాయికగా నిలచిన అమల, తరువాత జీవితనాయిక అయ్యారు. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు అమల, నాగార్జున. వారి కుమారుడు అఖిల్ బాల్యంలోనే ‘సిసింద్రీ’గా నటించి ఆకట్టుకున్నాడు. ‘సిసింద్రీ’ షూటింగ్ సమయంలో అమల తన తనయుడు అఖిల్ ను నటింప చేయడంలో ఎంత శ్రద్ధ వహించారో అందరికీ తెలుసు. ఇప్పటికీ తన దరి చేరిన పాత్రల్లో నటించడానికి సిద్ధం అంటారు అమల. ఆ మధ్య ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో నటించారు. తరువాత అక్కినేని ఫ్యామిలీ హీరోస్ అందరూ అభినయించిన ‘మనం’లోనూ ఆమె కాసేపు కనిపించారు. బుల్లితెరపైనా అమల కొన్ని సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తోన్న తెలుగు, తమిళ చిత్రంలోనూ అమల ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అమల మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.