NTV Telugu Site icon

కుప్పం పోలింగ్‌కి సర్వం సిద్ధం..24 వార్డులకు రేపే ఎన్నికలు

ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలు. నిత్యం వివాదాలమయంగా మారాయి ఇక్కడి ఎన్నికలు. అటు అధికార, విపక్షాలు ఇక్కడి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కుప్పం నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వంత ఇలాకా కావడంతో అక్కడ ప్రజాతీర్పు ఎలా వుంటుందోనని యావత్ ఆంధ్ర రాష్ట్రం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

కుప్పం మున్సిపాలిటీ కి సంబంధించిన 24 వార్డులలో సోమవారం నాడు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఎన్నికల అధికారి చిట్టిబాబు తెలిపారు. కుప్పం మున్సిపాలిటీ లో మొత్తం 25 వార్డులు ఉండగా ఒక వార్డు ఏకగ్రీవం అయిందని 24 వార్డులకు సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికల కోసం 48 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందుకోసం 48 మంది పోలింగ్ అధికారులు, 48 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, 96 మంది పోలింగ్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగిందని చిట్టిబాబు చెప్పారు.

ఎన్నికల పర్యవేక్షణ కోసం ఏడుగురు ఎన్నికల అధికారులు, ఏడుగురు అదనపు ఎన్నికల అధికారులు, మరో ఏడుగురు సహాయ ఎన్నికల అధికారులు విధుల్లో వున్నారు. కుప్పంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మొత్తం 48 పోలింగ్ కేంద్రాలలో 16 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా, 22 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందన్నారు.

ఈ ప్రాంతాలలోని ఒక్కో పోలింగ్ కేంద్రానికి పదిమంది పోలీసులు ఉండేటట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బ్యాలెట్ పేపర్ పద్దతిలో జరిగే పోలింగ్ లో మొత్తం మున్సిపాలిటీలో 39,259 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ మెటీరియల్ తో ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను చేరుకుంటున్నారని చిట్టిబాబు తెలిపారు.పోలింగ్ అనంతరం ఎం సి జె డిగ్రీ కళాశాలకు తరలించి భద్రపరుస్తారని,అనంతరం 17 వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.