NTV Telugu Site icon

హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలో మోడల్ కోడ్ ఉంటుంది-శశాంక్‌ గోయల్‌

తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ షెడ్యూల్‌కు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు. లోకల్ 12 సీట్లకు షెడ్యూల్ ప్రకటన చేయగా.. ఆదిలాబాద్, వరంగల్, మెదక్ నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం లో ఉన్న ఒక్కొక్క సీటు,మహబూబ్ నగర్,రంగారెడ్డి జిల్లా రెండు స్థానాలకు ఎన్నిక జరుగనుంది.

నవంబర్ 16న నోటిఫికేషన్, నవంబర్ 23 నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ, నవంబర్ 24 నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26 ఉపసంహరణకు చివరి తేదీ, డిసెంబర్ 10 పోలింగ్, డిసెంబర్ 14 కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. పోలింగ్ సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని, కరోనా నేపథ్యంలో ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో భారత ఎన్నికల సంఘం ఇచ్చిన కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. వ్యాక్సినేషన్ కూడా అందరికి వేయాలని, ఇవాల్టి నుండి మోడల్ కోడ్ అమలులో ఉంటుందన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ ఏవిధంగా ఉంటుందో అలానే ఈ ఎన్నికలకు కోడ్ ఉంటుందని, అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. రాజకీయ పార్టీల నేతలు, ఓటర్లు అందరూ కూడా కోవిడ్ నిబంధనలు, మోడల్ కోడ్ ను పాటించాలన్నారు.


500 మంది కంటే ఎక్కువ మందితో సభలు సమావేశాలు పెట్టరాదని, ఎలాంటి రాజకీయ పార్టీల సభలు సమావేశాలకు అనుమతి లేదని తెలిపారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికల నిర్వహణ ఉంటుందని, హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాలో మోడల్ కోడ్ ఉంటుందని స్పష్టం చేశారు. నామినేషన్లలో ర్యాలీలు లేవు, వాహనాలు మాత్రమే అనుమతి ఉంటుంది. స్టార్ క్యంపైనర్ లు ఉండరని ఆయన అన్నారు.