(జూన్ 16న నటి అంజలి పుట్టినరోజు)
మునుపటిలా తెలుగమ్మాయిలు చిత్రసీమలో రాణించలేకపోతున్నారు- ఈ మాట చాలా రోజులుగా తెలుగు చిత్రసీమలో వినిపిస్తూనే ఉంది. నిజానికి సినిమా రంగంలోని పరిస్థితుల కారణంగా అయితేనేమి, ఇతరత్రా అయితేనేమి తెలుగు అమ్మాయిలు అంతగా నటనారంగంవైపు ఆసక్తి చూపించడం లేదు. ఆ సమయంలో శివనాగేశ్వరరావు తెరకెక్కించిన ఫోటో చిత్రంతో అచ్చతెలుగు అమ్మాయి అంజలి పరిచయమయింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జన్మించిన అంజలి రాగానే తనదైన అభినయంతో ఆకట్టుకుంది. రాజోలు పాప భలే చేస్తుంది అని కితాబు నిచ్చారే కానీ, ఎవరూ అంతగా అవకాశాలు కల్పించలేదు. ఈ నేపథ్యంలో మాతృభాషను వదలి పరభాషలవైపు చూపు మళ్ళించిన అంజలికి తమిళనాట మంచి అవకాశాలు లభించడమే కాదు, నటిగానూ గుర్తింపు సంపాదించింది. దాదాపు ఆరేళ్ళు తమిళ చిత్రాలలోనే తకధిమి తై అంటూ సాగింది అంజలి. దిల్ రాజు నిర్మించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో మరోమారు మాతృభాషలో నటించింది. ఈ సినిమా నటిగా అంజలికి మంచి పేరు సంపాదించిపెట్టడమే కాదు, తెలుగులోనూ అవకాశాలను తీసుకు వచ్చింది. బలుపు, గీతాంజలి, శంకరాభరణం, మసాలా, డిక్టేటర్ చిత్రాలలో మంచి పాత్రలలోనే అలరించింది. అంతకు ముందే కొన్ని తమిళ చిత్రాలలో స్పెషల్ ఐటమ్ సాంగ్స్ లో మెరిసిన అంజలి, బోయపాటి శ్రీను సరైనోడులోనూ ఓ పాటలో చిందేసి కనువిందు చేసింది. తరువాత అటు తమిళం,ఇటు తెలుగులో నటిస్తూ సాగిన అంజలి ఇటీవలే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్లో కీలకమైన పాత్ర పోషించి, అలరించింది.
కొన్ని చిత్రాలలో కీ రోల్స్ లోనూ, మరికొన్ని సినిమాల్లో నాయికగానూ నటించి అలరించిన అంజలికి గీతాంజలి చిత్రం ఉత్తమనటిగా నంది అవార్డును సంపాదించి పెట్టింది. మునుముందు కూడా తనదైన అభినయంతో అలరించాలని చూస్తోన్న అంజలి అనేక లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో ఇప్పటికే నటించి మురిపించింది. ఇకపై కూడా ఆ తరహా పాత్రలే ఆమెను వరించేలా కనిపిస్తోంది. వెంకటేశ్ ఎఫ్ 3లో కీలక పాత్రలో కనిపించనున్న అంజలి తనదైన బాణీ పలికిస్తూనే సాగుతోంది. అప్పట్లో అంజలి ప్రేమాయణం, ఆమె పినతల్లి గొడవ సంచలనం సృష్టించాయి. ఆ తరువాత అంజలి నటనపైనే దృష్టిని కేంద్రీకరిస్తూ ముందుకు సాగుతోంది. రాబోయే రోజుల్లో అంజలి తనదైన అభినయంతో మరింతగా అలరిస్తుందని ఆశిద్దాం.