Site icon NTV Telugu

నాలుగు రాష్ట్రాలలో మళ్లీ బీజేపీదే అధికారం… స్పష్టం చేసిన సర్వే

దేశంలో వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలలో జరిగే ఎన్నికలపై ఇప్పటి నుంచి కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో మరోసారి బీజేపీనే అధికారం చేపట్టనుందని ఏబీపీ-సీ ఓటర్ సర్వే స్పష్టం చేసింది. అయితే గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఈసారి సీట్లు తక్కువగా వస్తాయని సర్వే వెల్లడించింది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా… 2017 ఎన్నికల్లో బీజేపీ 325 స్థానాలలో విజయకేతనం ఎగురవేసింది. అయితే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీకి 217 స్థానాలు మాత్రమే వస్తాయని.. తద్వారా తక్కువ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని సర్వే ద్వారా వెల్లడైంది. ఈ దఫా సమాజ్‌వాదీ పార్టీ 150 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే తెలిపింది.

Read Also: టీ20 ప్రపంచకప్‌: కౌన్ బనేగా న్యూ ఛాంపియన్?

మరోవైపు పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అతిపెద్ద పార్టీగా నిలవనున్నట్లు వెల్లడైంది. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 51 స్థానాల్లో విజయం సాధిస్తుందని సీ ఓటర్ సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీ 31, అకాలీదళ్ 20 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. గోవాలోనూ మళ్ళీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని సర్వే వెల్లడించింది. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో బీజేపీ 21 చోట్ల విజయం సాధిస్తుందని సర్వేలో వెల్లడైంది. ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీ అధికారం నల్లేరుపై నడకేనని తేలింది. కానీ గతంలో వచ్చినంత మెజారిటీ రాదని వెల్లడైంది. 70 స్థానాలు ఉన్న ఉత్తరాంఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 36 స్థానాలు కావాల్సి ఉండగా.. బీజేపీ 38 చోట్ల విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. మణిపూర్‌లో మరోసారి బీజేపీ పాగా వేయనున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ 27 చోట్ల విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ 22 చోట్ల గెలుస్తుందని సర్వేలో తేలింది.

Exit mobile version