NTV Telugu Site icon

సంతోషం కోసం బీచ్‌కు వెళితే.. ఆ దంపతులకు ఊహించని షాక్‌..

హాలిడే ట్రిప్‌లో ఎంజాయ్‌ చేద్దామని బీచ్‌కు వెళ్లిన దంపతులకు ఊహించని షాక్‌ ఎదురైంది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంటికి తిరిగివచ్చారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. గుజరాత్‌కు చెందిన అజిత్‌-సరళ దంపతులు హాలిడే ట్రిప్‌ కోసం దయూలోని నంగావ్‌ బీచ్‌కు వచ్చారు. అక్కడ పారా సెయిలింగ్‌ చేయాలనుకున్నారు. దీంతో పారా సెయిలింగ్‌ నిర్వాహకులు వారిని పవర్‌ బోట్‌ సహాయంతో పారాచూట్‌ ద్వారా ఆకాశంలోకి పంపించారు.

అలా సముద్రంలో పారా సెయిలింగ్‌ చేస్తున్న దంపతులు ఒక్కసారిగా ఉలిక్కిపడే ఘటన చోటు చేసుకుంది. పవర్‌ బోట్‌కు పారాచూట్‌కు అనుసంధానంగా ఉన్న తాడు తెగిపోయింది. దీంతో ఆ దంపతులు ఆందోళన చెందారు. పారాచూట్‌తో సహా కొంత దూరం వెళ్లి సముద్రంలో పడిపోయారు. తాడు తెగిపోవడాన్ని గమనించిన అజిత్‌ సోదరుడు కేకలు వేయడంతో అప్రమత్తమైన పారా సెయిలింగ్‌ సిబ్బంది, వెంటనే స్పందించి దంపతులు సముద్రంలో పడిపోయిన చోటుకు చేరుకున్నారు. దంపతులు లైఫ్‌ జాకెట్‌ వేసుకోవడంతో పెను ప్రమాదమే తప్పదని అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.