(సెప్టెంబర్ 8న కలసివుంటే కలదు సుఖం
కు 60 ఏళ్ళు పూర్తి)
ఆ రోజుల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఓ కుటుంబంలా ఉండేవారు. నిర్మాతను తల్లిగా, దర్శకుడిని తండ్రిగా భావించేవారు. హీరో పెద్దకొడుకుగా బాధ్యతలు స్వీకరించేవారు. ఇలాంటి నీతినియమాలు అన్నవి సినిమా పుట్టిన దగ్గర నుంచీ అంతటా ఉన్నవే. అవి మన దేశంలోనూ సినిమా రంగం స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో పరిఢవిల్లాయి. ఆ నాటి మేటి నటులు ఇవే నియమాలను తు.చ.తప్పక పాటించేవారు. మహానటుడు యన్.టి.రామారావు మరింతగా అనుసరించేవారు. ఈ నేపథ్యంలోనే సారథీ స్టూడియోస్ వారు ఆయనతో సినిమాలు తీయాలని నిర్ణయించారు. తమిళంలో విజయం సాధించిన భాగ పిరివినై
ఆధారంగా ఓ చిత్రం నిర్మించాలని భావించారు. అదే కలసివుంటే కలదు సుఖం
. ఈ చిత్ర నిర్మాణ సమయంలో యన్టీఆర్ నిజంగానే ఓ పెద్ద కొడుకులా ప్రవర్తించేవారని ఆ చిత్రానికి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి తరచూ చెప్పేవారు. ఈ చిత్ర నిర్మాణం హైదరాబాద్ సారథి స్టూడియోస్ లో జరిగే సమయంలో యన్టీఆర్ కు అప్పట్లో పేరున్న బ్రిడ్జ్ హోటల్ లో షూట్ బుక్ చేశారు. అయితే యన్టీఆర్ అందుకు అంగీకరించలేదు. హోటల్ లో బస చేస్తే దానికి ఓ ఖర్చు. అక్కడ నుండి స్టూడియో రావడానికి మరింత సమయం పడుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని యన్టీఆర్ తాను స్టూడియోస్ లోని ఓ రూమ్ లోనే ఉంటానని చెప్పారు. అలా తన నిర్మాతకు ఖర్చు తగ్గించినట్టు అవుతుందని యన్టీఆర్ భావించారు. ఆయన ఎక్కడైనా ఇదే తీరున ప్రవర్తించేవారని తమ్మారెడ్డి కృష్ణమూర్తి చెప్పేవారు. ఈ చిత్రానికి తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. సారథీ వారు నిర్మించిన రోజులు మారాయి
చిత్రానికి తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. అందువల్ల కలసివుంటే కలదు సుఖం
చిత్రానికి కూడా తాపీ చాణక్యనే ఎంచుకున్నారు. తమిళంలో శివాజీ గణేశన్ పోషించిన పాత్రను తెలుగులో రామారావు ధరించగా, బి.సరోజాదేవి నటించిన పాత్రలో సావిత్రి అభినయించారు. 1961 సెప్టెంబర్ 8న విడుదలయిన కలసివుంటే కలదు సుఖం
చిత్రం కూడా ఘనవిజయం సాధించింది.
కలసివుంటే కలదు సుఖం
కథలోకి తొంగి చూస్తే-ఇది ఇద్దరు అన్నదమ్ముల ఉమ్మడి కుటుంబం కథ. అన్న,తమ్ముడు కలసి ఉంటారు. అన్నకు పిల్లలు ఉండరు. తమ్మునికి ఇద్దరు కొడుకులు. వారిలో పెద్దవాడు చిన్నప్పుడే ఓ షాక్ వల్ల అవిటివాడు అయి ఉంటాడు. అతని పేరు కిష్టయ్య. చిన్నవాడు రఘు పట్నంలో చదువుకుంటాడు. తనకు పిల్లలు లేనికారణంగా తమ్ముడి చిన్న కొడుకు రఘును దత్తత తీసుకుంటాడు అన్న. ఇక అన్న భార్యకు ఓ అల్లుడు రంగూన్ రాజా ఉంటాడు. వాడు వచ్చి రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెడతాడు. అవిటివాడయిన కిష్టయ్యను రాధ అనే అమ్మాయి పెళ్ళి చేసుకుంటుంది. చిన్నవాడయిన రఘు, తన బావ చెల్లెలు అయిన జానికిని పెళ్ళాడతాడు. కిష్టయ్యకు ఓ కొడుకు పుడతాడు. కరెంట్ ట్రీట్ మెంట్ తో కిష్టయ్య అవిటి తనం నయమవుతుందని తెలిసి పట్నం వెళతారు. అక్కడ ఓ గది తీసుకొని కిష్టయ్య, రాధ, వారి బాబు ఉంటారు. రఘు పనిచేసే బ్యాంక్ లో డబ్బు తీసుకొని, ఓ నాటకాల కంపెనీ పెట్టి దివాళా తీస్తాడు రంగూన్ రాజా. దాంతో కిష్టయ్య కొడుకును తీసుకు వెళ్ళి సర్కస్ కంపెనీ వారికి అమ్ముతాడు. తమ బిడ్డ కోసం రాధ, కిష్టయ్య వెళతారు. అక్కడ బాబును రక్షించడానికి వెళ్ళిన కిష్టయ్యకు కరెంట్ షాక్ కొడుతుంది. అవిటితనం పోతుంది. చివరకు రంగూన్ రాజా నేరస్థుడు అని రుజువవుతుంది. పోలీసులు పట్టుకు పోతారు. అయితే ఎలాగైనా అతణ్ణి విడిపించాలని కిష్టయ్య పెదనాన్నకు చెబుతాడు. అతని మంచి తనం చూసి రంగూన్ రాజా సైతం కరిగిపోతాడు. తనలాంటి వాడిని కూడా ప్రేమించే మంచి మనసు ఉన్న కిష్టయ్య కుటుంబం పలు కష్టాల పాలు కావడానికి తానే కారమని భావిస్తాడు. శిక్ష అనుభవించి వచ్చాక అందరితో కలసి రంగూన్ రాజా కూడా పనిచేసుకుంటూ ఉంటాడు. కథ అలా సుఖాంతమవుతుంది.
అవిటివాడిగా యన్టీఆర్ అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఇక రాధ పాత్రలో సావిత్రి తనదైన నటన ప్రదర్శించారు. పెదనాన్నగా యస్వీ రంగారావు, ఆయన తమ్మునిగా పెరుమాళ్ళు నటించారు. ఈ చిత్రంలో హరనాథ్, గిరిజ, రేలంగి, సూర్యకాంతం, హేమలత, అల్లు రామలింగయ్య, పద్మినీ ప్రియదర్శిని ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ రచన చేయగా, దర్శకుడు తాపీ చాణక్య స్క్రీన్ ప్లే రాశారు. ఇక ఇందులోని పాటలను కొసరాజు, శ్రీశ్రీ, ఆరుద్ర పలికించగా, మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు. గణనాథుని... బంగారం... భద్రాద్రి రామయ్యా...
, ముద్దబంతి పూలుపెట్టి... మొగలి రేకును జడను చుట్టి...
, కలసివుంటే కలదు సుఖం...
వంటి పాటలను కొసరాజు రాశారు. శ్రీశ్రీ రాసిన ఆటల తీరులు...
, ఆరుద్ర రచించిన మేలిమి బంగారం...
, ”నా వరాల తండ్రీ…” పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఆ రోజుల్లో ఈ సినిమా పాటల పుస్తకం జనాన్ని భలేగా ఆకర్షించింది. అందులో కార్టూన్లతో ఈ చిత్ర కథను తెలుపడం ప్రధాన ఆకర్షణగా నిలచి, పాటల పుస్తకాలు విశేషంగా అమ్ముడు పోయాయి.
తెలుగులో కలసివుంటే కలదు సుఖం
ఘనవిజయం సాధించింది. ఎంతలా అంటే, రూపాయికి మూడు రూపాయలు లాభం వచ్చినంతగా. ఈ సినిమాను కన్నడలో రాజ్ కుమార్ హీరోగా మురియద మనే
పేరుతో రీమేక్ చేయగా, అప్పటికే కన్నడ సీమలో యన్టీఆర్ కలసి ఉంటే కలదు సుఖం
అనేక కేంద్రాలలో ప్రదర్శితమైన కారణంగా, రాజ్ చిత్రాన్ని ఎవరూ అంతగా ఆదరించలేదు. ఇక ఇదే కథతో హిందీలో సునీల్ దత్, నూతన్ జంటగా రూపొందిన రంగుల చిత్రం ఖాన్ దాన్
మంచి విజయం సాధించింది. కలసివుంటే కలదు సుఖం
కథలో అన్నదమ్ముల్లో పిల్లలు లేనివారు తమ సోదరుల పిల్లాడినే దత్తత తీసుకోవడం అన్నది ప్రధానాంశం. ఇదే కథతో తరువాత దసరాబుల్లోడు
కూడా వెలుగు చూసింది. అదీ ఘనవిజయం సాధించింది. ఈ తీరున తరువాతి రోజుల్లోనూ తెలుగు చిత్రాలు విడుదలై విజయం సాధించడం విశేషం!