NTV Telugu Site icon

50 ఏళ్ళ ‘చలాకీ రాణి – కిలాడీ రాజా’

యాక్షన్ మూవీస్ తో కృష్ణ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొనే క్రమంలో ‘మోసగాళ్ళకు మోసగాడు’తో తొలి తెలుగు కౌబోయ్ హీరో అనిపించుకున్నారు. ఆ చిత్రం తరువాత కృష్ణతో సినిమాలు తెరకెక్కించిన వారందరూ యాక్షన్ కే పెద్ద పీట వేశారు. ఆ కోవలో తెరకెక్కిన చిత్రమే ‘చలాకీ రాణి – కిలాడీ రాజా’. అప్పట్లో యాక్షన్ లేడీగా విజయలలితకు ఓ స్పెషల్ క్రేజ్ ఉండేది. ‘రౌడీ రాణి’ చిత్రంతో జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నారామె. ఈ నేపథ్యంలో కృష్ణ, విజయలలిత జంటగా రూపొందిన చిత్రం ‘చలాకీ రాణి – కిలాడీ రాజా’. 1971 అక్టోబర్ 29న ఈ చిత్రం విడుదలై జనాన్ని అలరించింది.

‘చలాకీ రాణి – కిలాడీ రాజా’లో యాక్షన్ తో పాటు తల్లి సెంటిమెంట్ నూ రంగరించారు దర్శకుడు విజయ్. కథ విషయానికి వస్తే – రుద్రయ్య ఓ దొంగలముఠాలో పనిచేస్తుంటాడు. బాస్ చెప్పినట్టుగా ఓ అమూల్యమైన వజ్రాన్ని దొంగిలిస్తాడు. దానిని బాస్ కు చేరవేయకుండా పారిపోతాడు. అతనికి భార్య శాంత, ఓ కొడుకు ఉంటారు. కొట్టేసిన వజ్రాన్ని పూజాదీపంలో పెట్టి భార్యకు ఇచ్చి పారిపోతాడు. అతని బాస్ పంపిన మనుషులు శాంతను చిత్రవధ చేస్తారు. ఆలోగా పోలీస్ సైరన్ వినిపించడంతో ఆమెను వదిలేసి వెళ్తారు. తన కొడుకును దొంగల వాతావరణానికి దూరంగా పెంచి పెద్ద చేస్తుంది. అయితే అతను కూడా ఎందరినో మోసగిస్తూ తిరుగుతూ ఉంటాడు. అతణ్ణి పట్టుకోవడానికి రాణి అనే అమ్మాయి మఫ్టీలో వెంటాడుతూ ఉంటుంది. భర్తలాగే తనయుడు కూడా చెడ్డదారుల్లో తిరుగుతున్నాడని, శాంత వాపోతుంది. అయినా తల్లి మాట లెక్క చేయడు కృష్ణ. రుద్రయ్యను ఏళ్ళ పాటు పట్టుకొని చిత్రవధ చేసినా, అతడు వజ్రం ఎక్కడ దాచాడో చెప్పడు. దొంగల ముఠాలోని వారు ఆ వజ్రం కోసం శాంతమ్మను కూడా పలు మార్లు వేధిస్తూ ఉంటారు. చివరకు కృష్ణ, ఆ వజ్రం ఎక్కడ ఉందో కనిపెట్టి అసలు నేరస్థులను చట్టానికి పట్టిస్తాడు. ఈ విషయంలో రాణి, ఆమె అనుచరులు సైతం కృష్ణను అనుమానిస్తూనే ఉంటారు. శాంతమ్మ మాత్రం కొడుకు కూడా దొంగ అని బాధ పడుతూ ఉంటుంది. పోలీసులు వచ్చి, అతను ఇంటలిజెన్స్ ఆఫీసర్ అని చెప్పడంతో శాంతమ్మ, రాణి ఆనందిస్తారు. తనయుని చేతుల మీదుగా రుద్రయ్యకు సంకెళ్ళు పడతాయి. జైలుకు పోతూండగా, భార్య, కొడుకు చూస్తూంటారు. కథ ముగుస్తుంది.

ఇందులో అంజలీదేవి, సత్యనారాయణ, జగ్గారావు, ఆనంద్ మోహన్, నల్ల రామ్మూర్తి, విజయశ్రీ, జ్యోతిలక్ష్మి, రాజబాబు, త్యాగరాజు, ప్రభాకర్ రెడ్డి, మిక్కిలినేని ముఖ్యపాత్రధారులు. తరువాతి రోజుల్లో ‘కన్నడ’ ప్రభాకర్ గా పేరొందిన ప్రభాకర్ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి సంగీతం సత్యం సమకూర్చగా, కొసరాజు, ఆరుద్ర, వీటూరి, దాశరథి పాటలు రాశారు. విద్యాన్ కణ్వశ్రీ మాటలు పలికించారు. ఇందులోని “భలే కుర్రదానా… హుషారైన జానా…” పాట ఆ రోజుల్లో మారుమోగి పోయింది. యువతను భలేగా ఆకట్టుకుంది. విజయశ్రీపై చిత్రీకరించిన “ఓ బుల్లి మావా…” పాట, జ్యోతిలక్ష్మిపై రూపొందించిన “అమ్మబాబూ… నీ అబ్బ సోకు మాడా…” , విజయలలితపై తెరకెక్కించిన “జతగాడా…రా రా…” పాటలు కూడా అలరించాయి.