(ఆగస్టు 29తో ‘అమావాస్య చంద్రుడు’కు 40 ఏళ్ళు)
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన నూరవ చిత్రం ‘రాజా పార్వై’. నిర్మాతగా కమల్ కు ఇదే తొలి చిత్రం. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’ పేరుతో అనువదించారు. తమిళ చిత్రం 1981 ఏప్రిల్ 10న విడుదల కాగా, తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’ ఆగస్టు 29న జనం ముందు నిలచింది. కమల్ హాసన్ ఆయన అన్నలు చారుహాసన్, చంద్రహాసన్ సైతం ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్నారు. అందువల్ల తమ బ్యానర్ కు ‘హాసన్ బ్రదర్స్’ అనే టైటిల్ పెట్టుకున్నారు. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఇళయరాజా బాణీల్లో ‘అమావాస్య చంద్రుడు’ ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే కమల్ హాసన్ చేసిన ఈ ప్రయత్నం పెద్దగా సక్సెస్ సాధించిందేమీ లేదు. అయితే నటునిగా కమల్ కు తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించి పెట్టింది. వైవిధ్యం కోసం తపించే కమల్ ఈ సినిమా టైటిల్స్ ను వరైటీగా ప్లాన్ చేశారు. ‘ఈ చిత్రాన్ని సృష్టించిన వారు’ – అంటూ టైటిల్స్ స్క్రోల్ కావడం ఆ రోజుల్లో విశేషంగా చర్చించుకున్నారు.
కథ విషయానికి వస్తే – రఘు అందగాడు. అయితే తన రూపాన్నే చూసుకోలేని విధంగా అతను పుట్టుకతో అంధుడు. ఓ సందర్భంలో నాన్సీ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. రఘులోని మంచితనం, అతనిలోని కళాకారుడు నాన్సీని ఆకర్షిస్తారు. అతణ్ణి ఎంతగానో అభిమానిస్తుంది. ఆ అభిమానం కాస్తా ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీస్తుంది. నాన్సీ క్రిస్టియన్ కావడంతో ఆమె తండ్రి వారి వివాహానికి అంగీకరించడు. చివరకు నాన్సీ నాన్నమ్మ, తాతయ్య ఇద్దరూ నాన్సీని రఘుతో లేచిపోయేలా చేస్తారు. కథ ఇంతే అయినా, దీనిని సింగీతం తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రంలో కమల్ హాసన్, మాధవి, కాంతారావు, చారుహాసన్, చంద్రహాసన్, కాంతారావు, లలిత, వై.జి.మహేంద్రన్, ఢిల్లీ గణేశ్, వి.కె.రామస్వామి, రాజాలక్ష్మి పార్థసారథి, నిర్మలమ్మ, రాధాకుమారి నటించారు. ప్రఖ్యాత దర్శకనిర్మాత, నటుడు, ప్రసాద్ సంస్థల అధినేత ఎల్.వి.ప్రసాద్ ఈ చిత్రంలో హీరోయిన్ తాతగా నటించారు. ఈ చిత్రానికి ఆత్రేయ, రాజశ్రీ రచన చేయగా, వేటూరి పాటలు రాశారు. తమిళంలో వైరముత్తు రాసిన “అంది మళై పొళికిరదు…” పాటను తెలుగులో “సుందరమో సుమధురమో…” అంటూ మనోహరంగా పలికించారు వేటూరి సుందర రామ్మూర్తి. అంతకు ముందు ఇళయరాజా బాణీలకు వేటూరి కొన్ని సినిమాల్లో రాసినా, ఈ పాట విన్న తరువాత “ఒరిజినల్ కంటే బాగుందని” కితాబు నిచ్చారు ఇళయరాజా. ఆ తరువాత నుంచీ ఇళయరాజా, వేటూరి కలయికలో అనేక సూపర్ హిట్ మ్యూజికల్స్ తెలుగువారిని అలరించడం అందరికీ తెలిసిందే! ఇప్పటికీ ‘అమావాస్య చంద్రుడు’ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పాట – “సుందరమో సుమధురమో…” అన్నదే.