(అక్టోబర్ 2న ‘రాక్షసుడు’కు 35 ఏళ్ళు పూర్తి)
తెలుగు సినిమా మూడోతరం కథానాయకుల్లో నవలానాయకుడు అన్న ఇమేజ్ సొంతం చేసుకున్నది మెగాస్టార్ చిరంజీవే! ఆయన నటించిన పలు నవలా చిత్రాలు విజయకేతనం ఎగురవేశాయి. చిరంజీవి, ఎ.కోదండరామిరెడ్డి, క్రియేటివ్ కమర్షియల్స్ కె.ఎస్.రామారావు, ఇళయరాజా, యండమూరి కాంబినేషన్ లో రూపొందిన నవలా చిత్రాలు తెలుగువారిని విశేషంగా మురిపించాయి. అంతకు ముందు ఈ కాంబినేషన్ లోనే రూపొందిన ‘అభిలాష’, ‘ఛాలెంజ్’ చిత్రాలు అటు మ్యూజికల్ హిట్స్ గానూ, ఇటు కమర్షియల్ సక్సెస్ ను చవిచూశాయి. ఆ సినిమాల తరువాత చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో కె.ఎస్.రామారావు నిర్మించిన ‘రాక్షసుడు’ 1986 అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా జనం ముందు నిలచింది. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘రాక్షసుడు’ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి ఇళయరాజా బాణీలు భలేగా సందడి చేశాయి.
‘రాక్షసుడు’ కథలోకి తొంగి చూస్తే – చిన్నవయసులోనే తల్లి అయిన ఓ అమ్మాయి తన బిడ్డను అనాథాశ్రమం చెంతవదిలేస్తుంది. అనాథలను తీసుకువెళ్ళి వారితో బండచాకిరీ చేయిస్తుంటాడు వీ.ఆర్. అనే కాంట్రాక్టర్. అతనే ఈ బాబును కూడా తీసుకుపోయి, అడవిలో పనిచేయిస్తుంటాడు. అక్కడ దాదాపు ఇరవై సంవత్సరాలు కష్టాలు పడతాడు. యువకుడైన అతని పేరు పురుష అంటూ ఉంటారు. అతని నేస్తం సింహంతో కలసి అడవి నుండి తప్పించుకుంటాడు పురుష. తల్లి కోసం ఆరా తీస్తూ పలు ప్రదేశాలు తిరుగుతూ ఉంటాడు. ఓ భూస్వామి వద్ద తన తల్లి ఉందని తెలుసుకొని అక్కడకు వెళతాడు పురుష. తనకు పదివేలు ఇస్తే, అతని తల్లి ఎక్కడ ఉందో చెబుతానంటాడు. ఆ సొమ్ము సంపాదించుకొస్తాడు పురుష. అయితే జేకే అనే వ్యక్తి యాభై వేలు ఇచ్చి, పురుష తల్లిని తీసుకుపోతాడు. తన తల్లిని చూపించమని అడిగిన పురుషతో జేకే తనకు కావలసిన పనులు చేయించుకుంటాడు. ఈ క్రమంలోనే ఓ స్కూల్ టీచర్ సుమతి తారసపడుతుంది. ఆమెను ప్రేమిస్తాడు పురుష. వీఆర్ కూతురు శైలజ కూడా పురుషను ప్రేమిస్తుంది. వీఆర్, జేకే బద్ధశత్రువులు. అతనికి చెక్ పెట్టడానికే పురుషతో పలు పనులు చేయించుకుంటాడు జేకే. సుమతి అన్నయ్య విజయ్ హత్యకు గురవుతాడు. అందుకు కారణం వీఆర్ అని తెలుసుకుంటాడు. ఒకప్పుడు తనలాంటి అనాథలను అడవుల్లో వేధించింది కూడా వీఆర్ అని గుర్తిస్తాడు పురుష. చివరకు వీఆర్ ను మట్టుపెడతాడు. పోరాటంలో శైలజ ప్రాణాలు పోగొట్టుకుంటుంది. కడకు తల్లిని చేరుకుంటాడు పురుష. తనలాగే వీఆర్ బందీలుగా ఉన్నవారిని విడిపించడంతో కథ ముగుస్తుంది.
యండమూరి నవలకు ఎమ్.వి.ఎస్. హరనాథరావు మాటలు రాశారు. ఈ చిత్రంలోని ఐదు పాటలను వేటూరి పలికించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన “జయ జయ ప్రియభారత జనయిత్రీ…దివ్యధాత్రి…” గీతాన్ని అనువుగా ఉపయోగించుకున్నారు. ఇందులోని “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు…”, “హే నాటీ లవ్ బోయ్…”, “అచ్ఛా అచ్ఛా వచ్చా వచ్చా…”, “గిలిగా గిలిగిలిగా గిలిగింతగా…”, “నీ మీద నాకు ఇదయ్యో…” వంటి పాటలు భలేగా ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రంలో సుహాసిని, రాధ, జయమాల, టైగర్ ప్రభాకర్, రావు గోపాలరావు, రాజేంద్రప్రసాద్, అన్నపూర్ణ, సుమలత, సంయుక్త, ఎమ్.వి.ఎస్.హరనాథరావు, నర్రా, పి.జె.శర్మ, జగ్గారావు తదితరులు నటించారు.
‘రాక్షసుడు’ సీరియల్ గా ప్రచురితమవుతున్న రోజుల నుంచీ పాఠకులను విశేషంగా ఆకట్టుకుంది. నవలగా వచ్చాక మరింతమందిని అలరించింది. ఈ నేపథ్యంలో సినిమా ఆరంభం నుంచీ మంచి క్రేజ్ సంపాదించుకుంది. గాంధీ జయంతి కానుకగా వచ్చినా, ఆ యేడాది మరో వారానికే దసరా పండగ కూడా వచ్చింది. దాంతో ‘రాక్షసుడు’ మంచి వసూళ్ళు చూసింది. అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.