NTV Telugu Site icon

ఫ్యామిలీ మేన్ -2’లో సమ్ము క్యారెక్టర్ రీ-ఎడిట్ చేస్తారా!?

మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మేన్’ సీజన్ 2 ట్రైలర్ ఇలా విడుదలైందో లేదో అలా కంట్రావర్శీలకు తెర లేపింది. మొదటి సీజన్ లో కాశ్మీర్ మిలిటెంట్స్ ను బేస్ చేసుకుని కథను నడిపిన ‘ది ఫ్యామిలీ మేన్’ దర్శక నిర్మాతలు ఈ సెకండ్ సీజన్ లో తమ ఫోకస్ ను దక్షిణాది మీద పెట్టారు. మరీ ముఖ్యంగా ఎల్టీటీఈ తీవ్రవాదులను టార్గెట్ చేస్తూ ఈ సీజన్ ను నడిపారని ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతోంది. దాంతో ఇప్పుడు తమిళనాట ‘ది ఫ్యామిలీ మేన్ -2’ హేటర్స్ సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.

ఎల్టీటీవీ సంస్థను తీవ్రవాద సంస్థగా చూపించడంతో పాటు దానికి పాకిస్తాన్ ఐఎస్ఐ తో సంబంధం ఉన్నట్టుగా ఈ ట్రైలర్ లో ఉండటాన్ని నటుడు, దర్శకుడు సీమాన్ తీవ్రంగా ఖండిస్తున్నాడు. నామ్ తమిళర్ కడ్చి పార్టీ అధినేత అయిన సీమాన్… ఈ వెబ్ సీరిస్ ను బ్యాన్ చేయాలని చెబుతున్నాడు. ఒకవేళ అందుకు దర్శక నిర్మాతలు అంగీకరించపోతే, జరిగే పర్యవసానాలకు వారే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నాడు. ఇందులో ప్రతినాయిక పాత్రధారి సమంత వేసుకున్న డ్రస్ ఎల్టీటీఈ డ్రస్ కోడ్ నే తలపిస్తోందని, ఆమె నోటి వెంట వచ్చే సంభాషణలు సైతం ఆమె ఆ సంస్థ తీవ్రవాది అన్నట్టుగానే చెబుతున్నాయని సీమాన్ అంటున్నారు. తమిళ ప్రజలు హింసావాదులనే భావన కలిగించేలా ఈ వెబ్ సీరిస్ ఉందన్నది ఆయన మరో ఆరోపణ.

కొద్ది నెలల క్రితమే దేశ సమగ్రతకు భంగం కలిగించే అంశాలేవీ వెబ్ సీరిస్ లలో ఉండకుండా జాగ్రత్త పడాలని కేంద్ర ప్రభుత్వం ఓటీటీ సంస్థలకు హితవు పలికింది. ఈ నేపథ్యంలో ‘ది ఫ్యామిలీ మేన్ -2’ ను ఒకటికి రెండు సార్లు చూసి, ఎలాంటి అభ్యంతరకర అంశాలు లేకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారని, అందుకే సీజన్ 2 స్ట్రీమింగ్ కావడం కూడా ఆలస్యమైందని తెలుస్తోంది. కానీ ఇప్పుడు తాజాగా వెల్లువెత్తుతున్న నిరసనలతో సమంత పాత్రను మరోసారి రీ-ఎడిట్ చేసే ఆస్కారం ఉందని అంటున్నారు. ఒకవేళ నిర్మాతలు ఆ పనిచేయకుండా అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేస్తే మాత్రం… మేకర్స్ తో పాటు ఇందులో కీలక పాత్ర పోషించిన సమంత సైతం చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.