NTV Telugu Site icon

విజయ్ ‘బీస్ట్’పై కన్నేసిన బాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్!

దళపతి విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో విడుదల కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ‘బీస్ట్’ మూవీపై బాలీవుడ్ నిర్మాతల కన్నుపడింది. అయితే ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా ఈ సినిమా రీమేక్ హక్కుల్ని ఫ్యాన్స్ ఆఫర్ తో సొంతం చేసుకోవాలనుకుంటున్నాడట. పోటీపడుతున్న వారిలో ఇప్పుడు సాజిద్ దే పైచేయిగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సాజిద్ ఆఫర్ పై ఇంకా సన్ పిక్చర్స్ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. ఇటీవల సాజిద్ నడియాద్ వాలా దక్షిణాది చిత్రాల రీమేక్స్ పై గట్టి దృష్టి పెట్టాడు. హిందీలో వీటిని యధాతథంగా కాకుండా మెయిన్ కంటెంట్ ను మాత్రం తీసుకుని, ఉత్తరాది వారికి నచ్చేలా సరికొత్త స్క్రీన్ ప్లే తో రీమేక్ చేస్తున్నాడు.

ఆ మధ్య ‘వర్షం’ రీమేక్ హక్కులు తీసుకుని ‘బాఘీ’ చిత్రాన్ని పూర్తిగా మార్చేసి తీశాడు సాజిద్ నడియాద్ వాలా. అలానే ‘కిక్’ సినిమానూ చాలా వరకూ మార్చి తీశాడు. తాజాగా తమిళ చిత్రం ‘జిగర్తాండ’ హక్కుల్ని తీసుకుని ‘బచ్చన్ పాండే’ పేరుతో రీమేక్ చేశాడు. ఇది ‘జిగర్తాండ’ రీమేక్ అని చెబితే కానీ తెలియనంతగా మార్పులు చేర్పులు చేశాడట. అలానే రేపు ‘బీస్ట్’ సినిమా కథను ఉత్తరాది వీక్షకుల ఆలోచనలకు అనుగుణంగా రీమేక్ చేయాలని సాజిద్ భావిస్తున్నాడట. ఒక్కసారి సన్ పిక్చర్స్ నుండి హక్కులు లభిస్తే, వెంటనే నటీనటులను ప్రకటించడంతో పాటు రీమేక్ షూటింగ్ నూ స్టార్ట్ చేయాలన్నది సాజిద్ నడియాద్ వాలా ఆలోచన అని తెలుస్తోంది.