NTV Telugu Site icon

రివ్యూ: తూఫాన్ (హిందీ)

దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా అనగానే ఠక్కున గుర్తొచ్చే సినిమాలు రెండు. 2006లో వచ్చిన ‘రంగ్ దే బసంతి’, 2013లో విడుదలైన ‘భాగ్ మిల్కా భాగ్’. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత ఫర్హాన్ అక్తర్ తోనే మరో స్పోర్ట్స్ డ్రామా ‘తూఫాన్’ ను తెరకెక్కించి, ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రాన్ని మరోసారి గుర్తు చేశారు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా. అయితే… ఆయన గత చిత్రాలతో పోల్చినప్పుడు ‘తూఫాన్’ ఆ స్థాయిలో లేదనే నిరాశ వీక్షకులకు కలుగుతుంది. కానీ ఇప్పటికీ నటుడిగా పర్హాన్ అక్తర్ లో అదే కమిట్ మెంట్ ఉండటం చూసి ఆనందం కలుగుతుంది. ‘తూఫాన్’ చిత్రం శుక్రవారం నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ విషయానికి వస్తే… డోంగ్రీలో పుట్టి పెరిగిన అజీజ్ అలీ ఉరఫ్ అజ్జూభాయ్‌ (ఫర్హాన్ అక్తర్)కి ముందు వెనుక ఎవరూ ఉండరు. జాఫర్ భాయ్ (విజయ్ రాజ్) దగ్గర అప్పులు తీసుకుని ఎగ్గొట్టే వారి నుండి డబ్బులను వసూలు చేస్తుంటాడు అజ్జూ. అయితే ఆ వీధి రౌడీకీ మంచి మనసు ఉంటుంది. చుట్టుపక్కల ఉండే బీద పిల్లల ఆలనా పాలనా అజ్జూభాయ్ పట్టించుకుంటూ ఉంటాడు. అలాంటి అజ్జూభాయ్ కి జిమ్ ఓనర్ ఒకతను లెజెండరీ బాక్సర్ మహ్మద్ అలీ వీడియోలను చూపిస్తాడు. దాంతో అజ్జూభాయ్ దృష్టి పైసా వసూల్ నుండి బాక్సింగ్ వైపు మళ్ళుతుంది. అజ్జూభాయ్ ఏరియాలోని ఛారిటీ హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్ అనన్య ప్రభు (మృణాల్ ఠాకూర్) సైతం అతనికి పద్ధతి మార్చుకోమని హితబోధ చేస్తుంది. స్టేట్ లెవెన్ ఛాంపియన్ కావాలంటే నానా ప్రభు (పరేశ్ రావెల్) దగ్గర శిక్షణ తీసుకోవాలని అజ్జూభాయ్ తెలుసుకుంటాడు. అయితే నానా ప్రభుకు ముస్లింలంటే పడదు. అతని భార్య ఉగ్రదాడిలో చనిపోయిన దగ్గర నుండి ముస్లింలంటే దేశద్రోహులనే భావన బలంగా ఏర్పడిపోతుంది. కానీ అజీజ్ అలీలోని తపన చూసి, తన శిష్యుడిగా చేర్చుకుంటాడు నానా ప్రభు. అతని శిక్షణలో అజీజ్ స్టేట్ ఛాంపియన్ అవుతాడు. అతనో తూఫాన్ అని, నేషనల్ ఛాంపియన్ కావడం ఖాయమని నానా ప్రభు మీడియా ముందు ప్రకటిస్తాడు. ఇది జరిగిన కొద్దిరోజులకే అజీజ్ తన కూతురు అనన్య ప్రేమలో పడ్డారనే విషయం నానా ప్రభుకు తెలుస్తుంది. దాంతో వీరిద్దరినీ దూషించి, దండిస్తాడు. అజీజ్ ను మనస్ఫూర్తిగా ప్రేమించిన అనన్య తండ్రిని కాదని అతనితో వెళ్ళిపోతుంది. నేషనల్ ఛాంపియన్ అవ్వాలనుకున్న అజీజ్ అలీ కోరిక నెరవేరిందా? మతాంతర వివాహం కారణంగా ఈ ప్రేమ జంట ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? తన నుండి దూరమై పోయిన కూతురుని నానా ప్రభు తిరిగి కలుసుకున్నాడా? అనేది మిగతా కథ.

రెండున్నర గంటలకు పైగా నిడివి ఉన్న ఈ సినిమాలో దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్‌ మెహ్రా చాలా విషయాలనే చర్చించాడు. వెనకబడిన ప్రాంతానికి చెందిన ముస్లిం కుర్రాడు జాతీయ స్థాయిలో బాక్సింగ్ ఛాంపియన్ ఎలా అయ్యాడనేది ప్రధానాంశంగా పైకి కనిపించినా, ప్రస్తుత సమాజంలో చాలామందిని తొలిచివేస్తున్న మతపరమైన అనే ప్రశ్నలనూ పాత్రధారుల ద్వారా వీక్షకుల మీదకు సంధించాడు. ముస్లిం ఉగ్రవాదం, తద్వారా ప్రతి ముస్లింనూ మెజారిటీ హిందువులు అనుమానించడం, ఫుడ్ ఆర్డర్ చేసేప్పుడూ మతం కోణంలో ఆలోచించడం, సమాజంలో పెరిగిపోతున్న మతతత్త్వం, తరిగిపోతున్న పరమత సహనం, లవ్ జిహాద్ భయాలు… ఇవన్నీ తెర మీద ఏదో ఒక స్థాయిలో చర్చకు పెట్టాడు దర్శకుడు. అయితే… దానికి తగ్గట్టుగానే సన్నివేశాలనూ రాసుకున్నాడు. దాంతో దర్శకుడి వాదన పట్ల వీక్షకులు సైతం మొగ్గు చూపుతారు.

ప్రధాన కథాంశంలోకి వెళితే మాత్రం సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ వీక్షకుల ఊహకు తగ్గట్టుగానే కథ సాగుతుంది. ఊహించని మలుపులు, మెరుపులూ ఏం కనిపించవు. పైగా మధ్య మధ్యలో వచ్చే పాటలు కథన వేగానికి అడ్డు పడ్డాయి. కథ బలహీనంగా ఉన్నా, నటీనటుల నటన సినిమాను మరో స్థాయిలోకి తీసుకెళ్ళిందని చెప్పాలి. ఫర్హాన్ అక్తర్ తన మనసులో మెదిలిన ఈ కథకు అజ్జూ భాయ్ పాత్ర ద్వారా సంపూర్ణ న్యాయం చేకూర్చాడు. ‘భాగ్ మిల్కా భాగ్’లోనే మేకోవర్ అంటే ఏమిటో చూపిన ఫర్హాన్ ఎనిమిదేళ్ళ తర్వాత కూడా అదే రీతిన కష్టపడటం అభినందించదగ్గది. ఇక ఇప్పటికే పలు చిత్రాలలో నటించిన మృణాల్ ఠాకూర్ లేడీ డాక్టర్ అనన్య పాత్రలో ఒదిగిపోయింది. విశేషం ఏమంటే… తెలుగు ‘జెర్సీ’ హిందీ రీమేక్ లోనూ మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులోనూ దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించే త్రిభాష చిత్రంలో కథానాయికగా ఆమె పేరే వినిపిస్తోంది. ఇక సీనియర్ నటుడు పరేశ్ రావెల్ నటనకు వంక పెట్టేదే లేదు. నానా ప్రభు పాత్రను అతను పోషించడం వల్ల అది మరింత రక్తి కట్టింది. ఎందుకంటే… పరేశ్ రావెల్ బీజేపీ మాజీ పార్లమెంట్ సభ్యుడు. అతనితో పాటు ఇతర ప్రధాన పాత్రలను మోహన్ అగాసే, దర్శన్ కుమార్, సుప్రియా పాఠక్, హుస్సేన్ దలాల్, విజయ్ రాజ్ తదితరులు పోషించారు. సోనాలి కులకర్ణి… పరేశ్ రావెల్ భార్యగా అతిథిపాత్రలో మెరిసింది. ఈ సినిమా దర్శక నిర్మాత రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా సైతం ఐబిఎఫ్ సెక్రటరీ పాత్రలో కొద్దిసేపు తెర మీద కనిపించాడు.

నిజానికి గత యేడాదే ‘తూఫాన్’ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా అలా జరగలేదు. ఇప్పుడు కూడా కరోనా సెకండ్ వేవ్ ఈ మూవీని దెబ్బకొట్టింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దర్శక నిర్మాతలు ‘తూఫాన్’ను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేసేశారు. థియేటర్లలో విడుదలై ఉంటే ఎలా ఉండేదో కానీ… ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి మిశ్రమ స్పందనే వస్తోంది. కొంతమంది సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ చిత్రంతో పోల్చితే, మరి కొంతమంది ఆ మధ్య వచ్చిన రణవీర్ సింగ్ ‘గల్లీ బోయ్’ థీమ్ ఇదే కదా అంటూ పెదవి విరుస్తున్నారు. ఒకటి మాత్రం నిజం…. గతంలో వచ్చిన ఫర్హాన్, రాకేశ్ మెహ్రా ‘భాగ్ మిల్కా భాగ్’తో పోల్చుకోకపోతే… ‘తూఫాన్’ నచ్చుతుంది. అయినా… ఇలాంటి స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని ఓసారి చూడటంలో తప్పులేదు.

ప్లస్ పాయింట్స్
ఫర్హాన్ అక్తర్ మేకోవర్
ఎంచుకున్న కథ
నటీనటుల నటన
ఎమోషనల్ సీన్స్

మైనెస్ పాయింట్
ఊహకందే సన్నివేశాలు
పాత చిత్రాలు జ్ఞప్తికి రావడం
మూవీ రన్ టైమ్

రేటింగ్ : 2.75 / 5

ట్యాగ్ లైన్: ఉత్తేజభరితం!