NTV Telugu Site icon

వంద‌కు జై కొడుతున్న హీరోలు!

వంద అన్న మాట‌కు ఉన్న విలువ ఏ ప‌దానికి అంత‌గా క‌నిపించ‌దు. సంస్కృతంలో శ‌తం అన్నా, తెలుగులో నూరు అన్నా, అదే వంద‌నే! సినిమా రంగంలో కూడా వంద‌కున్న విలువ దేనికీ లేద‌నే చెప్పొచ్చు. ఒక‌ప్పుడు వంద రోజులు ఆడిన సినిమా అంటే హిట్ మూవీగా లెక్కేసేవారు. ఆ త‌రువాత వంద‌ కేంద్రాల‌లో శ‌త‌దినోత్సవం అన‌గానే మ‌రింత సూప‌ర్ హిట్ అన్నారు. ఆ పై వంద కోట్లు పోగేసిన సినిమాను సూప‌ర్ డూప‌ర్ హిట్ అంటున్నారు. వాటికి క్లబ్బులూ పెట్టేశారు. అన్నీ దాటుకొని కొంద‌రు హీరోలు ఏకంగా వంద కోట్లు అందుకోబోతున్నారంటే ఆశ్చర్యం, ఆస‌క్తి క‌లుగ‌క‌మాన‌వు. ప్రస్తుతం మేకింగ్ ప‌రంగా, మార్కెట్ దృష్ట్యా హిందీ సినిమాల‌కు స‌వాల్ విస‌రుతున్నాయి తెలుగు చిత్రాలు. గ‌తంలో ఏ ప్రాంతీయ సినిమా కూడా ఈ స్థాయిలో విజ‌యం సాధించిన దాఖ‌లాలు లేవు. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ టాప్ స్టార్స్ తో మ‌న టాలీవుడ్ సూప‌ర్ స్టార్స్ పోటీ ప‌డుతున్నారు. హిందీలో షారుఖ్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్, అమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి వారు ఏదో ఒక రూపంలో సినిమాకు వంద కోట్లు పుచ్చుకుంటార‌ని వింటూ వ‌చ్చాం. ఇప్పుడు మ‌న ప్రభాస్ కూడా అదే తీరున వంద అందుకోబోతున్నార‌ని బాలీవుడ్ లోనూ విశేషంగా వినిపిస్తోంది. ప్రభాస్ తో ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోన్న ఆదిపురుష్ కోసం ఆయ‌న తీసుకుంటున్న పారితోషికం అక్షరాలా నూరు కోట్లని చెబుతున్నారు. అలాగే అర్జున్ రెడ్డితో ఇక్కడ‌, క‌బీర్ సింగ్తో ఉత్తరాదిన పేరు సంపాదించిన సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించే స్పిరిట్ సినిమాకు కూడా ప్రభాస్ వంద కోట్లు అందుకోబోతున్నార‌ని స‌మాచారం. ఈ స్పిరిట్ క‌థ తొలుత రామ్ చ‌ర‌ణ్ ను ప‌ల‌క‌రించింద‌ట‌. అత‌ను న‌చ్చక పోవ‌డంతో మ‌హేశ్ బాబు, అల్లు అర్జున్ ను కూడా టచ్ చేసింది. అయితే వారూ నో చెప్పడంతో చివ‌ర‌కు ప్రభాస్ చెంత చేరింద‌ని వినికిడి. ఈ సినిమాకు ప్రభాస్ 150 కోట్లు డిమాండ్ చేస్తున్నాడ‌నీ వినిపిస్తోంది.

ప్రభాస్ క‌థ అలా ఉంటే, అల్లు అర్జున్ పుష్ప-2 త‌రువాత న‌టించ‌బోయే చిత్రాల‌కు వంద కోట్లు డిమాండ్ చేస్తున్నాడ‌నీ తెలుస్తోంది. అట్లీ డైరెక్షన్ లో లైకా సంస్థ అల్లు అర్జున్ తో తెర‌కెక్కించ‌బోయే సినిమాకు శ‌తకోట్లతో చిత‌క్కొట్టబోతున్నట్టు వినికిడి. య‌శ్ రాజ్ ఫిలిమ్స్ త‌దుప‌రి చిత్రంలో న‌టించ‌డానికి షారుఖ్ సైతం వంద కోట్లు పుచ్చుకుంటున్నార‌ని స‌మాచారం. స‌ల్మాన్ ఖాన్ తో సాజిద్ న‌డియ‌డ్వాలా నిర్మించ‌బోయే చిత్రానికి 125 కోట్లు అంటుకుంటున్నార‌ట‌! అక్షయ్ కుమార్ కూడా అంతే మొత్తాన్ని త‌న నిర్మాత‌ల నుండి డిమాండ్ చేస్తున్నట్టు భోగ‌ట్టా! ఇంకా చెప్పాలంటే స‌ల్మాన్ కంటే ఓ రెండు, మూడు కోట్లు అక్షయ్ కుమార్ ఎక్కువే తీసుకుంటార‌నీ తెలుస్తోంది. మొన్నటి దాకా 80 కోట్ల రూపాయ‌లే పుచ్చుకొనే త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్ కూడా ఇప్పుడు శ‌తం కావాలంటున్నట్టు స‌మాచారం. ఇలా ఒక్కో స్టార్ హీరో త‌న రెమ్యూన‌రేష‌న్ ను వంద‌కు చేర్చుకుంటూ పోతే, మిగ‌తా న‌టీన‌టుల‌కు ఇచ్చేది ఎంత‌? నిర్మాణానికి వ్యయం చేసేది ఎంత‌? అంటే ఈ రీతిన ఇక్కడ పేర్కొన్న
టాప్ స్టార్స్ తో సినిమాలు తీయాలంటే ఎంత లేద‌న్నా, నిర్మాత‌కు 250 నుండి 350 కోట్ల రూపాయ‌లు కావ‌ల‌సి వ‌స్తుంది. స‌ద‌రు చిత్రాలు క‌నీసం మ‌రో వంద‌ కోట్ల లాభాల‌కు అమ్ముకోవ‌ల‌సి వ‌స్తుంది. అంటే 350 నుండి 500 కోట్ల బిజినెస్ సాగాలి.

ఇక కొనుగోలు దారులు వీరి చిత్రాల ద్వారా ల‌బ్ధి పొందాలంటే ఎంత లేద‌న్నా, త‌మ పెట్టుబ‌డిపై మ‌రో 20 శాతం రాబ‌ట్ట గ‌ల‌గాలి. మ‌రి వీరి సినిమాలు అంత వ‌సూలు చేస్తాయా? అన్నదే ప్రశ్న. ఇప్పటిక‌యితే వంద‌కోట్లు అంటూ ట‌ముకు సాగుతోంది కానీ, నిజానికి ఇంత మొత్తాలు తీసుకుంటున్నారా? లేక ఇవి కూడా ఫేక్ క‌లెక్షన్ల‌లాగే ప‌బ్లిసిటీ స్టంటా? అన్న అనుమానాలూ బ‌య‌లు దేరుతున్నాయి.
కొంద‌రి పై అనుమానాలు ఉండ‌వ‌చ్చును కానీ, విజ‌య్ మాత్రం త‌న సినిమా మ‌రింత లాభాలు ఆర్జిస్తే, అందులోనూ వాటా అడుగుతున్నట్టు స‌మాచారం. ఇలాంటి చిత్రాలు చూసి ఇంకా ఎంత‌మంది హీరోలు ప్యాన్ ఇండియా మూవీస్ పై మ‌న‌సు పారేసుకుంటారో వంద‌కు జై కొడ‌తారో చూడాలి.