NTV Telugu Site icon

డైరెక్ట్ ఓటీటీకే సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’!

సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తి కుమార్ దీనికి దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ‘జీ 5’ ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనుంది. ఫిబ్రవరిలో సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథాంశంతో రూపొందిన సినిమా ‘మళ్ళీ మొదలైంది’. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్ రాజన్, న్యాయవాది పాత్రలో ముఖ్య కథానాయికగా నైనా గంగూలీ నటించారు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన ‘ఎలోన్ ఎలోన్’కు అద్భుత స్పందన లభించింది. ఈ సినిమాకు చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈవో. ఈ సినిమా మేకింగ్ సమయంలో విడుదలైన వెడ్డింగ్ కార్డ్ అప్పట్లో సోషల్ మీడియాలో సుమంత్ మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నాడే నీలివార్తలకు దారితీసింది. ఆ తర్వాత అదంతా సినిమా షూటింగ్ కోసం ప్రచురించిన వెడ్డింగ్ కార్డ్ అని తేటతెల్లమైంది. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘మళ్ళీ మొదలైంది’ మూవీ థియేటర్లలో కాకుండా ఓటీటీ బాట పట్టడం విశేషం.