NTV Telugu Site icon

జ‌నం నాడి ప‌ట్టి… ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 3!

పోస్ట్ క‌రోనా టైమ్స్ లో భార‌త‌దేశంలోనే కాదు… ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక శాతం మంది చైనాను ద్వేషించ‌డం మొద‌లు పెట్టారు. కొవిడ్ 19 వైర‌స్ చైనాలోని ఊహాన్ ల్యాబ్స్ లోనే పుట్టింద‌ని విశ్వ‌సిస్తున్నారు. చైనాకు వ్య‌తిరేకంగా గ‌ళం విప్ప‌టానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్ రూప‌క‌ర్త‌లు ప‌ర్ ఫెక్ట్ ప్లానింగ్ తోనే మూడో సీజ‌న్ కు శ్రీకారం చుట్ట‌బోతున్నార‌ని తెలుస్తోంది. తొలి సీజ‌న్ లో పాకిస్తాన్ ను, రెండో సీజ‌న్ లో శ్రీలంక‌కు చెందిన రాజ‌కీయ‌, చారిత్ర‌క అంశాల‌ను ట‌చ్ చేసిన రాజ్, డీకే ఈ సారి త‌మ దృష్టిని చైనా మీద సారించ‌బోతున్నారు. దానికి త‌గ్గ హింట్ ను సీజ‌న్ 2 ఎండింగ్ లో వ‌చ్చారు. దీనికి ఆప‌రేష‌న్ గ్వాన్ యు అనే నామ‌కర‌ణం చేశారు. ఇది ప్రాచీన చైనాకు చెందిన ఓ మిల‌ట‌రీ అధికారి పేరు. మ‌రి అప్ప‌టి చ‌రిత్ర‌నూ రాజ్ అండ్ డీకే వెలికి తీస్తారా లేక పోతే… క‌రోనా నేప‌థ్యానికే ప‌రిమితం అవుతారా అనేది చూడాలి. తొలి సీజ‌న్ లో క‌థ ఢిల్లీ, ముంబై, కాశ్మీర్ ప్రాంతాల‌లో జ‌ర‌గ్గా, రెండో సీజ‌న్ ఢిల్లీ, ముంబై, చెన్నై, శ్రీలంక‌ల్లో జ‌రిగింది. మూడో సీజ‌న్ ను నాగాల్యాండ్ తో పాటు ఈశాన్య భార‌తంలోని ఏ యే రాష్ట్రాల‌లో తీస్తారో చూడాలి. విశేషం ఏమంటే… రొటీన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, రొట్ట‌కొట్టుడు ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌కు ప‌రిమితం కాకుండా రాజ్, డీకే టీమ్ క‌రెంట్ పొలిటిక‌ల్ ఇష్యూను కూడా బాగా స్ట‌డీ చేసి, స‌రైన పాయింట్స్ ను ప‌ట్టుకుంటోంది. చైనా వాణిజ్య ప‌రంగా ప్ర‌పంచ‌దేశాల‌పై ఎలాంటి ప‌ట్టు సాధిస్తోందో కూడా గుర్తిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఈ మూడో సీజ‌న్ కు క‌థ‌నూ సిద్ధం చేస్తున్న‌ట్టు అర్థ‌మౌతోంది. ఆ ర‌కంగా చూసిన‌ప్పుడు సీజ‌న్ వ‌న్, సీజ‌న్ టూ కంటే కూడా సీజ‌న్ త్రీ ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. చైనాపై మెజారిటీ జ‌నాల‌లో ఉన్న ద్వేష‌భావాన్ని రాజ్ అండ్ డీకే టీమ్ బాగానే క్యాష్ చేసుకునే ప‌నిలో పడ్డార‌ని చెప్పొచ్చు! ఓవ‌ర్ ఆల్ గా రెండో సీజ‌న్ పై వ‌చ్చిన త‌ర‌హాలో విమ‌ర్శ‌లు, వివాదాలు సీజ‌న్ త్రీకు రావ‌ని భావించొచ్చు.