తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన “కర్ణన్” చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కరోనా కారణంగా ఈ చిత్రం ఓటిటిలో విడుదలైంది. అయినప్పటికీ “కర్ణన్” ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా ఆకట్టుకున్నాడు. అణచివేతకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో గ్రిప్పింగ్ కథనంతో పాటు, ధనుష్ నటన టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఇప్పుడు ‘కర్ణన్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతుండడం విశేషం. ‘కర్ణన్’ సినిమా తెలుగు రీమేక్ హక్కులను బెల్లంకొండ సురేశ్ దక్కించుకున్నారు. తెలుగు రీమేక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించనున్నాడు. అయితే ప్రస్తుతం ఈ తమిళ సూపర్ హిట్ మూవీ తెలుగు రీమేక్‌కు ఎవరు దర్శకత్వం వహించబోతున్నారనే దానిపై అందరి దృష్టి ఉంది. తాజా సమాచారం ప్రకారం… శ్రీకాంత్ అడ్డాల ‘కర్ణన్’ తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు. ఇంతకుముందు ధనుష్ నటించిన హిట్ మూవీ ‘అసురన్’ తెలుగు రీమేక్ కు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు ‘నారప్ప’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. దీంతో దర్శకుడు శ్రీకాంత్ ‘కర్ణన్’ రీమేక్ కు కూడా మెగాఫోన్ పట్టే అవకాశం ఉందని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ‘కర్ణన్’ రీమేక్ కు ఎవరు దర్శకత్వం వహిస్తారో చూడాలి మరి.
‘కర్ణన్’ రీమేక్ కు దర్శకుడు అతనేనా ?
