NTV Telugu Site icon

మ‌హేశ్, త్రివిక్ర‌మ్ మూవీలో శిల్పాశెట్టి…!

మ‌హేశ్ బాబు, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌బోతున్న మూడో చిత్రం గురించి ఇప్ప‌టికే అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. గ‌తంలో వ‌చ్చిన అతడు, ఖ‌లేజా క‌మర్షియ‌ల్ గా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోయినా… ఆ ప్ర‌భావం ఏదీ ఈ మూవీ మీద ప‌డ‌టం లేదు. వీరిద్ద‌రూ ఇప్పుడూ సూప‌ర్ ఫామ్ లో ఉండ‌టంతో త‌ప్ప‌కుండా ఈ సినిమా మ‌రో లెవెల్ లో ఉంటుంద‌నే నమ్మ‌కంతో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మూవీలో ఓ కీల‌క పాత్రకు బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుంద‌రి శిల్పాశెట్టిని సంప్ర‌దిస్తున్నార‌న్న‌ది ఫిల్మ్ న‌గ‌ర్ లోని తాజా స‌మాచారం. గ‌తంలోనే తెలుగులో పలు చిత్రాల‌లో శిల్పాశెట్టి నాయిక‌గా న‌టించి, మెప్పించింది. ఇక వివాహానంత‌రం తెలుగు సినిమాల‌కూ దూర‌మైనా, అడ‌పాద‌డ‌పా వెండితెర‌పై క‌నిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఫిట్ నెస్ అండ్ యోగా వీడియోల‌తో ఫ్యాన్స్ కు చాలా చేరువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో ఆమెకు ఉన్న ఇమేజ్ కు స‌రిపోయే పాత్ర‌నే ఆమెతో త్రివిక్ర‌మ్ చేయించాల‌నుకుంటున్నార‌ని తెలుస్తోంది. అత్తారింటికి దారేది, అఆలో న‌దియా, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో స్నేహ‌, అజ్ఞాత‌వాసిలో ఖుష్బూ, అర‌వింద స‌మేత‌లో దేవ‌యాని, అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలో ట‌బూనూ తెలుగువారి ముందు కొత్త‌గా ఆవిష్క‌రించ‌డంలో తివిక్ర‌మ్ కృత‌కృత్యుడ‌య్యారు. అందుకే అల‌నాటి హీరోయిన్లు సైతం ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపుతున్నారు. సో… శిల్పాశెట్టి సైతం ఈ పాత్ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి… మ‌హేశ్, త్రివిక్ర‌మ్ మూవీకి మ‌రో హైలైట్ గా నిలుస్తార‌నే తెలుస్తోంది.