NTV Telugu Site icon

రివ్యూ: రూమ్ నంబర్ 54 (తెలుగు వెబ్ సీరిస్)

Room No.54 Telugu Web Series Review

కాలేజీలో చదివేప్పుడు డే స్కాలర్స్ అనుభవాలు ఒకలా ఉంటాయి. హాస్టల్ లో ఉండి చదువుకునే వాళ్ళ అనుభవాలు మరోలా ఉంటాయి. ఇక యూనివర్సిటీ హాస్టల్స్ లో ఉండే వాళ్ళయితే… కోర్సులతో నిమిత్తం లేకుండా యేళ్ళ తరబడి అక్కడే గడిపేస్తుంటారు. జీవితానికో ఆలంబన దొరికితే గానీ ఆ హాస్టల్ గది నుండి బయటపడరు. అలాంటి హాస్టల్ వాసుల ప్రహసనమే ‘రూమ్ నంబర్ 54’. ప్రస్తుతం జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సీరిస్ మనల్ని కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇతరుల సంగతీ ఎలా ఉన్నా… యూనివర్సిటీ హాస్టల్స్ లో గడిపిన వాళ్ళైతే మధుర స్మృతులనో, చేదు జ్ఞాపకాలనో గుర్తు చేసుకోవడం ఖాయం.

కథ విషయానికి వస్తే… ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ లో రూమ్ నంబర్ 54కు ఓ స్పెషాలిటీ ఉంటుంది. ఆ రూమ్ లో ఉండి చదువుకున్న వాళ్ళెవరూ దానితో ఉన్న అనుబంధాన్ని తెంచుకోరు. ఏ బ్యాచ్ వారైనా… ఏదో సమయంలో ఆ ఊరు వచ్చినప్పుడు ఓ సారి తమ రూమ్ కి అడుగుపెట్టి, అక్కడుండే స్టూడెంట్స్ కు తోచిన సలహాలు, సూచనలూ ఇస్తుంటారు. 2021లో ఆ రూమ్ లో ఉండటానికి రమేశ్, విశాల్, వినోద్ అనే కుర్రాళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా వస్తారు. రూమ్ నంబర్ 54 స్పెషాలిటీని వారికి తెలియచేస్తూ, 2002 లో ఆ రూమ్ లో ఉన్న నలుగురు కుర్రాళ్ళ జీవితంలో ఏం జరిగింది, వాళ్ళను ఆ యా సందర్భాలలో వారి ఓల్డ్ స్టూడెంట్స్ ఎలా గైడ్ చేశారో వార్డెన్ చెబుతాడు. అదే ఈ వెబ్ సీరిస్ కథ.

దాదాపు రెండు దశాబ్దాల క్రితం రూమ్ నంబర్ 54లో సినిమా డైరెక్టర్ కావాలని కలలు కంటూ, నోరు తెరిస్తే ఇంగ్లీషే మాట్లాడే ఓ బాబాయ్ (కృష్ణతేజ) ఉంటాడు. జీవితాన్ని లైట్ గా తీసుకుంటూ, టైమ్ దొరికితే చాలు క్రికెట్ ఆడటానికి తయారయ్యే వెంకట్రావ్ (మొయిన్) కూడా అదే రూమ్ లో చేరతాడు. నిత్యం ఏడుపుగొట్టు ముఖంతో ఏదో కోల్పోయినట్టు ఉంటూ, అంత నిరాశలోనూ క్లాస్ మెట్ సావిత్రితో ప్రేమలో పడిన ప్రసన్న (పవన్ రమేశ్) కూడా వీళ్ళ రూమ్మేటే! ఇక వీళ్ళతోనే అదే ఊరికి చెందిన డే స్కాలర్ యువరాజ్ (కృష్ణప్రసాద్) సైతం జత కలుస్తాడు. ఇంజనీరింగ్ చదివే సమయంలో వాళ్ళకు సంబంధించిన రకరకాల అనుభవాల సారంగా ఈ వెబ్ సీరిస్ నడుస్తుంది.

కుర్రాళ్ళు ఉండే హాస్టల్ కు హఠాత్తుగా తండ్రి వస్తే ఎలా ఉంటుంది? హాస్టల్ స్టూడెంట్స్ బర్త్ డే పార్టీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ట్రావెలింగ్ ప్లాన్స్ ఒక్కోసారి వాళ్లకు తీరని కలగా ఎలా మిగిలిపోతాయి? లవ్ బ్రేక్ అప్ ఎలాంటి బాధకు గురిచేస్తుంది? హోలీ పేరుతో జరిగే తంతు ఎక్కడకు దారితీస్తుంది? షార్ట్ కట్ తో ఏదో సాధించాలని ప్రయత్నిస్తే ఎలాంటి ఎదురు దెబ్బలు తగులుతాయి? ఎగ్జామ్స్ రిజల్డ్స్ విద్యార్థుల జీవితాలను ఎంత ఒత్తడికి గురిచేస్తాయి?… ఇలాంటి వివిధ అంశాలను ఓ పది ఎపిసోడ్స్ గా దర్శకుడు తీశాడు. ‘రూమ్ నంబర్ 54’లోని ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ గా పేరున్న నటులు ఒక్కో ఎపిసోడ్ లో ఎంట్రీ ఇస్తుంటే… నెక్ట్స్ ఎవరు వస్తారా అనే ఉత్సకత సహజంగానే వీక్షకులలో కలుగుతుంది.

మొదటి ఎపిసోడ్ లో ‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. అలానే ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్ గా ప్రియదర్శితో మొదలయ్యే గెస్ట్ ఆర్టిస్టుల మారథాన్ మిర్చి హేమంత్, చిత్రం శ్రీను, జెమినీ సురేశ్, సత్యదేవ్, నరసింహా, హరీష్‌, రచ్చ రవి, ఉత్తేజ్, మీదుగా సీనియర్ నటుడు తనికెళ్ళ భరణితో ముగుస్తుంది. ఆయన ఎంట్రీతో ఈ వెబ్ సీరిస్ కు ఓ గ్రాండ్ లుక్ వచ్చింది. ఇక ప్రధాన పాత్రధారులు నలుగురూ ఎంతో సహజంగా నటించారు. అమ్మాయిల్లో సావిత్రి, జమునగా శ్వేత, నవ్య అలరించారు. ఇతర పాత్రల్లో అశ్విన్, సింజిత్, విశాల్, వేణు వాత్యం కనిపించారు. దర్శకుడు గౌతమ్ రాసిన మాటలు చాలా బాగున్నాయి. ఏడుపు వాసన, ఐదు పైసల సామెతలు… వంటివి ఫన్నీగా ఉన్నాయి. ఆర్. ఆర్. ధృవన్ నేపథ్య సంగీతం చెప్పుకోదగ్గది.

అయితే… ఓవర్ ఆల్ గా చూసినప్పుడు నిర్మాణ విలువల విషయంలో కాస్తంత రాజీ పడినట్టు అనిపిస్తుంది. కాలేజీ హాస్టల్ లోని ఓ రూమ్ కు సంబంధించిన కథే అయినా… హాస్టల్ మొత్తంలోనూ ఈ రూమ్ లో మాత్రమే కుర్రాళ్ళు ఉన్నట్టుగా, అదేదో ఐసొలేషన్ వార్డులా చూపించారు. కనీసం ఈ కుర్రాళ్ళు టీకి బయటకు వచ్చినప్పుడూ, కూల్ డ్రింక్ షాప్ కు వచ్చినప్పుడూ, చుట్టూ పట్టుమని పది మందిని చూపించిన దాఖలాలు కనిపించవు. ఏదో కరోనా టైమ్ లో కావలసిన వారితో సింపుల్ గా చూట్టేశారనే భావన కలుగుతుంది. ఓ యూనివర్సిటీ హాస్టల్ లో ఉంటే గందరగోళ వాతావరణం, హంగామా, హడావుడీని మనం మిస్ అవుతున్నట్టు తెలిసిపోతుంది. మొక్కుబడిగా నాలుగు గోడల మధ్య దీనిని తీసేసేశారేమిటీ అనిపిస్తుంది.

ఓవర్ ఆల్ గా చెప్పుకోవాలంటే… నాలుగురు కుర్రాళ్ళ హాస్టల్ జీవితానికి సంబంధించిన కొన్ని సంఘటన సమాహారం ఇది. ఒక ఎపిసోడ్ కు మరో ఎపిసోడ్ కు ఇంటర్ లింక్ అనేది ఏదీ ఉండదు. సో… తర్వాత ఏం జరుగుతుందోననే ఉత్సుకత ఏదీ క్రియేట్ కాదు. అలాగని మనకు ఏ ఎసిపోడ్ కూడా బోర్ కొట్టదు. దాంతో ఒకటి రెండు ఎపిసోడ్స్ చూసిన తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి, మళ్ళీ తీరిక ఉన్నప్పుడు మిగిలినవి చూసి ఎంజాయ్ చేయొచ్చు. చిన్నా వాసుదేవరెడ్డి నిర్మించిన ఈ వెబ్ సీరిస్ కు ప్రముఖ నిర్మాత తరుణ్ భాస్కర్ సమర్పకుడిగా వ్యవహరించారు. అయితే… ఇటీవల నటుడిగానూ అదృష్టం పరీక్షించుకుంటున్న తరుణ్‌ భాస్కర్… ఈ వెబ్ సీరిస్ లో కనీసం గెస్ట్ అప్పీయరెన్స్ కూడా ఇవ్వలేదు ఎందుకో తెలియదు!

రేటింగ్: 2.25 / 5

ప్లస్ పాయింట్స్
హాస్టల్ నేపథ్యం కావడం
నటీనటుల సహజ నటన
ఆకట్టుకునే సంభాషణలు
ప్రముఖులు పోషించిన అతిథి పాత్రలు

మైనెస్ పాయింట్స్
బలమైన కథ లేకపోవడం
నిర్మాణ విలువల్లో రాజీ ధోరణి
ఫ్లాట్ గా సాగే కథనం

ట్యాగ్ లైన్: అనుభవాల అడ్డా!